హామీల అమలు కోసం మిలిటెంట్ ప్రజా ఉద్యమాలు
సీపీఎం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి నాగయ్య
మహబూబాబాద్, జులై 9 (విజయక్రాంతి): ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో మిలిటెంట్ ప్రజా ఉద్యమాలను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గొల్లపల్లి నాగయ్య వెల్లడించారు. మహబూబాబాద్ లో ఆ పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన జిల్లా వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ భూమిలేని మహిళలకు ఉపాధి హామీ పథకం కింద ఏటా 12 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రకటించిందని, దానిని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆసరా పథకం కింద దళిత, ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు.. ఇంతవరకు దాని ఊసే లేదని ఎద్దేవ చేశారు.
ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఒక్కంటికి 6 లక్షల రూపాయలు ఇండ్లకు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఆసరా పథకం ద్వారా పెన్షన్ 4 నుంచి 6వరకు పెంచుతామని చెప్పి, అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్యం వహిస్తుందని నాగయ్య విమర్శించారు. ఇంకోవైపు రాముడిపేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పు్పడు ఆ రాముడికే శఠగోపం పెట్టిందని ఆరోపించారు. దేవాలయంలో దోపిడీ జరిగినా ప్రధాని మాట్లాడడం లేదన్నారు.
ప్రశ్నించిన వారిని, ఎలాంటి విచారణ చేయకుండా, వాస్తవాలు నిర్ధారించకుండా గంటల్లో అరెస్టు చేస్తున్నారని, ఉపా చట్టం పేరుతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని. వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుణగంటి రాజన్న, అలవాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్, ఆకుల రాజు, కుంట ఉపేందర్, జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.






