సదాశివపేటలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సదాశివపేట, జూలై 26: సదాశివపేట పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం శిశిర హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సౌజన్యంతో నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించగా, డాక్టర్ సింధు మాధవనేని మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, కేంద్రానికి అవసరమైన వంటశాల, గోదాము నిర్మాణాలను ఎంపీ నిధులతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైద్యుల విధుల నిర్వహణపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరు సంగమేశ్వర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






