30 March, 2026 | 8:27 AM

యువకుడిపై కత్తులతో దాడి

16-05-2024 01:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో/చార్మినార్, మే 15 (విజయక్రాంతి): శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఓ యువకుడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సూరి అనే యువకుడి తలకు గాయం కాగా, దాడిని అడ్డుకోబోయిన మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు దుండగులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పారిపోయారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల వద్ద మరణాయుధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అప్పు తీర్చలేదని స్నేహితుడి హత్య..

ఇచ్చిన అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటన హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం ఇన్‌స్పెక్టర్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ పుట్‌పాత్‌పై కళ్లద్దాలు అమ్ముకునే మసూద్(28)కు మిథాలీ (25), సాహిద్(28), ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇద్దరు స్నేహితల వద్ద అవసరం ఉందని మసూద్ రూ. 13వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో తరుచూ ముగ్గురి మధ్య గొడవలు అవుతున్నాయి.

ఇదే క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ముర్గీచౌక్ ప్రాంతంలో గొడవ పడ్డారు. ఈ గొడవలో మిథాలీ, సాహిద్‌లు ఇద్దరు కలిసి మసూద్‌పై తీవ్రంగా దాడి చేశారు. కత్తులతో పొడిచారు. దీంతో అక్కడికక్కడే మసూద్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.