ప్రాణాలు తీస్తున్న ‘బెట్టింగ్’
ఆశతో మొదలై.. ఆత్మహత్యల వరకు
జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (విజయక్రాంతి): బెట్టింగ్ వ్యసనం ప్రాణాలు తీస్తోంది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఐపీఎల్ సీజన్‌లో రూ.వేల కోట్లు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపానికి కాసే బెట్టింగ్ రూ.వందల్లో మొదలై లక్షలు, కోట్ల వరకు చేరుకుంటుంది. బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయిన యువత అప్పులు తీర్చలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరికొందరు అప్పులు తీర్చడానికి దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, యువత అధికంగా బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో తమ పిల్లలు చేసిన అప్పులు తీర్చలేక కొన్ని కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి. పోలీసులు బెట్టింగ్ ముఠాలను గుర్తించి ఆట కట్టిస్తున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట బెట్టింగ్ భూతం మళ్లీ పుట్టుకొస్తుండటం గమనార్హం. బెట్టింగ్‌లకు చేసిన అప్పుల విషయంలోయువత ఒకవైపు తమ తల్లిదండ్రులను చంపుతుంటే.. ఎంత చెప్పినా బెట్టింగ్‌లు మానడం లేదని తల్లిదండ్రులు పిల్లలను చంపుకొంటున్నారు.
విచ్చలవిడిగా ఆన్‌లైన్ యాప్‌లు..
బెట్టింగ్ యాప్‌లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. విదేశాల్లో నుంచి కొందరు పంటర్లు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ముఠాలను గుర్తించి వారి తాట తీస్తున్నారు. ఆర్గనైజర్లు, బూకీలు, పంటర్లను పట్టుకొని కటకటాల్లోకి నెడుతున్నారు.
ఈ మధ్యన జరిగిన సంఘటనలు..
* మేడ్చల్‌కు చెందిన ముకేష్‌కుమార్(28) రైల్వే ఉద్యోగి. బెట్టింగ్‌లకు బానిసై సుమారు రూ.2 కోట్ల మేర అప్పులు చేశాడు. కొడుకు చేసిన అప్పులు తీర్చడానికి అతని తల్లిదండ్రులు ఇళ్లు, స్థలాలు విక్రయించి అప్పులు కట్టారు. అయినా కుమారుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన తండ్రి కన్నకొడుకునే చంపేశాడు.
* బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న సాయిశరత్ బెట్టింగ్‌లు కాసి సుమారు రూ.50 లక్షలు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో డ్రగ్స్ దందాలో దిగి చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.
* యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ హాస్టళ్లో ఉంటున్న నాగపృథ్వీ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడి రూ.లక్షల్లో అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి దొంగతనాలు చేయడం మొదలెట్టాడు. అతడిని పట్టుకున్న పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.




