21 July, 2026 | 12:05 PM

అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని దాడి

21-07-2026 12:31 AM

ఎంఈఓకు తల్లిదండ్రులు, విద్యార్థిసంఘాల వినతి

బెజ్జంకి జులై20: బెజ్జంకి మోడల్ స్కూల్లో పీఈడి (ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్) విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో సోమవారం పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుని సంబంధితపీఈడి పైఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేశారు. ఈ సందర్భంగా కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్కు సమాచారం ఇచ్చినా స్పందించలేదని, తమ ఫిర్యాదును పట్టించుకోలేదని కొందరు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులతో పిఈడి అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఘటనపై విద్యార్థిసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై తగిన చర్యలు చేపట్టాలనిమండల విద్యాధికారికి విద్యార్థి సంఘ నాయకులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

ప్రిన్సిపాల్ సంగీత : ‘విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నా దృష్టికి రాలేదు. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించి పై అధికారులకు నివేదిస్తాను. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతాం.