దళితుల భూముల కబ్జాకు యత్నం
- మల్లేశ్వరం గ్రామంలో ఉద్రిక్తత
- జేసీబీలతో పనులు చేపట్టడంపై రైతుల ఆందోళన
పెంట్లవెల్లి, మే 31: నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూము ల విషయంలో వివాదం తలెత్తింది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 238 పరిధిలో చెరువు సమీపంలో ఉన్న ఐదు ఎకరాల భూమిని 16 మంది దళిత రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిపై గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన వ్యక్తి ప్రయత్నం చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. రాత్రికి రాత్రే జేసీబీలతో భూమిలో పనులు చేసేందుకు ప్రయత్నించారని, ఆదివారం ఉదయం రెవెన్యూ అధికా రులు, పోలీసు బలగాల సమక్షంలో పనులు కొనసాగించేందుకు యత్నించారని పేర్కొన్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే భూ మి సాగు చేస్తున్న 16 మంది రైతులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తమకు ఆ భూములపై ప్రభుత్వం గతంలో లావణి పట్టాలు మంజూరు చేసిందని, అప్పటి పం చాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హయాంలోనే హక్కు పత్రాలు అందా యని రైతులు తెలిపారు. శ్రీశైలం జలాశయ ముంపు ప్రభావిత ప్రాంతంగా ఈ భూము ల్లో ఏళ్లుగా సాగు చేస్తున్నామని చెప్పారు. ఐదు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు. భూముల విషయంలో అన్యాయం జరిగితే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు సిద్ధమని రైతులు హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.






