మట్టి అక్రమ తవ్వకం!
- గ్రామాల్లో ట్రాక్టర్ల హడావుడి..
- చెరువులు, వాగుల్లో నుంచి తరలింపు
- పట్టించుకోని అధికారులు
- చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
చర్ల, మే 31, (విజయక్రాంతి): చర్ల మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. వాగులు, చెరువులు, ప్రభుత్వ భూములు అనే తేడా లేకుండా జేసీబీలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నా పట్టించుకునే అధికారులే లేరు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా కొండలు, గుట్టలను తవ్వి మట్టిని అక్రమంగా తరలించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో , జేసీబీలతో భారీగా మట్టిని తరలిస్తూ ’మట్టి మాఫియా’ కోట్లు కొల్లగొడుతుంటే, సంబంధిత అధికారులు (మైనింగ్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫారెస్ట్) చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చర్ల మండలం గుంపెన గూడెం గ్రామ పరిధిలోని వెళ్లే ప్రధాన రహదారి చివర ఉన్న వాగులో గురువారం నుండి యదేచ్చగా భారీగా జేసీబీలతో మట్టి తవ్వకాలు నిర్వహించి గ్రామాల్లో విక్రయిస్తున్నారు.
అదే విధంగా సి కత్తి గూడెం, గన్నవరం కాలనీ, ఉప్పరగూడెం, గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువులో కూడా పెద్ద ఎత్తున మట్టి తవ్వి తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. పర్మిషన్ లేకుండానే అక్రమ మట్టి రవాణా ఎలా చేస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టి తవ్వి తరలిస్తున్నారని ఆపేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మట్టి ఎక్కడికి తరలించబడుతోంది, ఎవరు అనుమతులు ఇచ్చారు అన్న ప్రశ్నలకు సమాధానం లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.
అధికారులపై విమర్శలు:
ఈ అక్రమ తవ్వకాల్లో అధికారుల నిర్లక్ష్యంపై వినిపిస్తున్న ప్రధాన విమర్శలు: చూసీచూడనట్లు వ్యవహరిం చడం: బహిరంగంగా భారీ యంత్రాలతో గుట్టలు, చెరువులను తవ్వుతున్నా, ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులతో కుమ్మక్కు: అధికారులు అక్రమ వ్యాపారుల నుంచి లంచాలు తీసుకుని సహకరిస్తు న్నారని, అందుకే మట్టి మాఫియా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి: భూగర్భ గనుల శాఖకు ఎలాంటి రాయల్టీ, సీనరేజీ చెల్లించకుండా మట్టి తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. పర్యావరణానికి తీవ్ర ముప్పు: వాల్టా చట్టాలకు తూట్లు పొడుస్తూ, ఇష్టానుసారంగా తవ్వడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది.
అక్రమ తవ్వకాలపై తరచూ పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ, తూతూ మంత్రంగా వాహనాలు పట్టుకోవడం తప్ప, కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్రమ మట్టి రవాణాను వెంటనే అరికట్టాలని, అనుమతులు లేకుండా మట్టి తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖతో పాటు సంబంధిత అధికారులు వెంటనే దృష్టి సారించి అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, వాగులు కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






