పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు
బెయిల్ కోసం అత్యవసర పిటిషన్
కేసుల వివరాలు అందజేయాలన్న హైకోర్టు
విచారణ నేటికి వాయిదా
విజయవాడ, మే 26 (విజయక్రాంతి): ఈవీఎంల ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పోలీసులు మూడు కేసులు నమోదు చేయడాన్ని మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆదివారం జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తన ఇంటి వద్ద విచారణ చేపట్టారు. ఏమైనాసరే పిటిషనర్‌ను అరెస్ట్ చేసి తీరాలన్న తలంపుతో పోలీసులు ఉన్నారని సీనియర్ అడ్వొకేట్ టీ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి దారుణంగా ఉందని, కక్ష సాధింపు చర్యలాగా కనిపిస్తున్నదని చెప్పారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెల్లారే పిటిషనర్‌పై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెలిపారు. పిటిషనర్ హత్యాయత్నం చేశారని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేసిన పది రోజులకు పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.
పోలీసులు వేరువేరుగా నమోదు చేసిన కేసులన్నీ ఎన్నికలకు సంబంధించినవేనని చెప్పారు. పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాల్సి ఉండగా ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని నియమించడాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈవీఎంలు ధ్వంసం చేశారన్న అభియోగాల కేసులో జూన్ ఆరో తేదీవరకు ముందస్తు బెయిలు మంజూరు చేసినట్టుగానే ఈ కేసుల్లో కూడా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదిస్తూ.. తీవ్ర నేరాలకు పాల్పడినందున మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. కౌంటింగ్ నాడు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని తెలిపారు. వాదనలు అనంతరం క్రైమ్ నంబర్ 50లో పిటిషనర్ పిన్నెల్లిని పోలీసులు ఎప్పుడు నిందితుడిగా చేర్చారో వివరాలను నివేదించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.






