29 July, 2026 | 2:11 AM

పెంపుడు కుక్కల కోసం ప్రత్యేక విమానం

27-05-2024 12:40 AM

సర్వీసులను ప్రారంభించిన బార్క్ సంస్థ

న్యూయార్క్, మే 26 : మనుషులకే కాదు జంతువులకు సైతం విమానం ఎక్కాలనే కోరిక ఉంటుంది. అందుకే, వాటి కోరిక తీర్చేందుకు బార్క్ అనే ఎయిర్‌లైన్ సంస్థ ముందుకొచ్చింది. ప్రత్యేకంగా పెంపుడు శునకాల కోసమే విమాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలి విమానం న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు చేరుకుంది. మొదటి సర్వీసులోనే అన్ని టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. శునకాల ఆహారం, ఆటబొమ్మలను విక్రయించే బార్క్ సంస్థ ఓ జెట్ చార్టర్ సర్వీస్ కంపెనీతో జట్టుకట్టి ‘బార్క్ ఎయిర్’ సర్వీసులను ప్రారంభించింది. ప్రపంచంలో ఇలా శునకాల కోసం ఏర్పాటైన రెండో విమానయాన సంస్థ ఇదే కావడం విశేషం.

బుకింగ్ ప్రక్రియ ఇదే.. 

ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత గంట ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. చెక్ ఇన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. క్యూలైన్లు, బోనుల వంటి హడావుడి అస్సలు ఉండదు. శునకాలకు విమానంలో ఇరుకుగా ఉండొద్దనే ఉద్దేశంతో విమాన సామర్థ్యానికి మించి టికెట్ బుకింగ్ తీసుకోబోమని బార్క్ ఎయిర్ వెల్లడించింది.

టికెట్ ధర ఎంతంటే?

ప్రస్తుతానికి ఈ సేవలను న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ నుంచి లండన్ మధ్య నడుపుతున్నారు. త్వరలో మరిన్ని మార్గాల్లోనూ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఈ విమానాల్లో శునకాలను తీసుకెళ్లడం మాత్రం ఖరీదైన విషయమే. న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్స్ ఒక శునకం, మనిషి వెళ్లడానికే 6,000 డాలర్లు (దాదాపు రూ. 4.98 లక్షలు). న్యూయార్క్ నుంచి లండన్‌కు ఈ మొత్తం 8,000 డాలర్లు (రూ. 6.65 లక్షలు) దాకా ఉంటుంది. గిరాకీ పుంజుకుంటున్న కొద్దీ ధరలను తగ్గిస్తామని కంపెనీ ప్రకటించింది.