18 July, 2026 | 10:10 AM

పెళ్లి సందడిలో మంగళస్నానం

30-11-2024 12:00 AM

అక్కినేని వారింట పెళ్లి సందడి షురూ అయ్యింది. నాగచైతన్య వివాహం శోభితా ధూళిపాళ్లతో జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4న జరిగే ఈ వేడుకకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి ఘట్టాన్ని ఆరంభించారు. హల్దీ వేడుకను శుక్రవారం నిర్వహించారు. కాబోయే కొత్త జంటకు మంగళస్నానాలు చేయించారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల పెళ్లి గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. ‘శోభితతో జీవితాన్ని పంచుకునేందుకు నేను ఎదురుచూస్తున్నా. పెళ్లి చాలా సింపుల్‌గా జరగనుంది. ఎలాంటి ఆర్భాటాలకూ తావులేదు. అతిథుల లిస్ట్, పెళ్లికి సంబంధించి అన్ని విషయాలనూ ఇద్దరం కలిసి చేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోస్‌లోని తాతగారి (నాగేశ్వరరావు) విగ్రహం ఎదురుగా పెళ్లి జరగనుంది. తాతయ్య ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని నేను నమ్ముతున్నా’ అని పేర్కొన్నాడు చైతూ.