ఆటో బోల్తా.. నాటు కూలీలకు గాయాలు
కోదాడ ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ,: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాటు కూలీలు కూలి పనుల కోసం ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. రత్నవరం గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న పలువురు కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు.
గాయపడిన కూలీలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మాజీ ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.






