30 July, 2026 | 4:19 PM

ప్రత్యామ్నాయ పంటలతో నష్టాలను నివారించండి

30-07-2026 03:41 PM

 కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అధిక నీటి అవసరమున్న వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సూచించారు. రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించి, రాయితీలు, సబ్సిడీలు, విత్తనాల పంపిణీ వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మండల స్థాయి సర్వసభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించాలని, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు, రీచార్జ్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వనపట్ల గ్రామం ఆదర్శంగా నిలవడాన్ని అభినందిస్తూ, ఇతర గ్రామాలు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో ఆర్థిక పారదర్శకత పాటిస్తూ, అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని కలెక్టర్ సూచించారు. గ్రామాభివృద్ధిలో ఆరోగ్యం, విద్య, ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.