15 July, 2026 | 7:04 PM

ప్రత్యామ్నాయ పంటలు, వ్యవసాయ నీటి కుంటలపై రైతులకు అవగాహన

15-07-2026 07:02 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని తురకగూడెం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు మరియు వ్యవసాయ నీటి కుంటల నిర్మాణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామడుగు వాణి మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటల సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలయిన పెసర, కంది, జొన్న, ఆముదం వంటి పంటలను సాగు చేయడం ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు నష్టాలను నివారించవచ్చని వివరించారు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం వల్ల దిగుబడులు మెరుగుపడటంతో పాటు రైతుల ఆదాయం కూడా స్థిరంగా ఉంటుందని తెలిపారు.అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100 శాతం రాయితీతో వ్యవసాయ నీటి కుంటలు (ఫార్మ్ పాండ్లు) నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నీటి కుంటలు 20 × 20 × 3 మీటర్లు, 12 × 12 × 2.5 మీటర్లు మరియు 8 × 8 × 2.5 మీటర్ల పరిమాణాల్లో నిర్మించబడతాయని వివరించారు.

వర్షాకాలంలో కురిసే వర్షపు నీటిని నిల్వ చేసి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవడానికి ఈ నీటి కుంటలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే భూగర్భ జలాల మట్టం పెరగడం, పంటలకు రక్షణాత్మక నీటిపారుదల అందించడం, కరువు పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పెరగడం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలకు కూడా ఈ కుంటలు దోహదపడతాయని రైతులకు వివరించారు. అర్హత కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ భూముల్లో నీటి కుంటలను నిర్మించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తురకగూడెం గ్రామ సర్పంచ్, వ్యవసాయ విస్తరణాధికారి జానీ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.