12-08-2025 12:40:56 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ ఫెయిర్‌తో విదేశీ విద్యపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని యూఎస్‌ఏ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకోవడంలో ఉన్న అవకాశాలు, సవాళ్లను ఈ ఫెయిర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లో 2025 ఎడ్యుకేషన్ యూఎస్‌ఏ యూనివర్సిటీ ఫెయిర్‌ను సోమవారం ఐటీసీ కోహినూర్ హోటల్‌లో నిర్వహించారు.
ఈ ఫెయిర్‌లో 30కిపైగా గుర్తింపు పొందిన అమెరికా విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. కొత్తగా వచ్చిన కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకోవడమనేది ప్రతి విద్యార్థి కలగా భావిస్తారని, అందుకు సమయం, డబ్బుని వెచ్చిస్తుంటారన్నారు. ఈ సదస్సుతో మంచి సంస్థలను ఎంచుకొనే అవకాశం కలుగుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
విదేశాల్లో చదివేందుకు విద్యార్థి వీసాకు అర్హత సాధించడంతో పాటు అక్కడి చట్టాలపై అవగాహన అవసరమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. మెచ్చిన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడంలో కచ్చితమైన సమాచారాన్ని ఈ ఫెయిర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ఈ సందర్భంగా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఎడ్యుకేషన్ యూఎస్‌ఎ ఫెయిర్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 17 వరకు చెన్ను, బెంగళూరు, హైదరాబాద్, తదితర నగరాల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.