calender_icon.png 30 December, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ భద్రత, ప్రయాణికుల భద్రత, మన అందరి బాధ్యత

30-12-2025 09:08:45 PM

గోదావరిఖని 1-టౌన్ ఇంద్రసేనా రెడ్డి

గోదావరిఖని,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా గోదావరిఖని–I టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాల పాటింపు, సురక్షిత ప్రయాణం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతకు ఆటో డ్రైవర్ల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వాహనం నడిపితే అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఆటోలో తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల ఫోటోలు ఉంచుకోవాలని సూచిస్తూ, మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు లేదా తప్పులు చేసినప్పుడు ఆ ఫోటోలను చూసి కుటుంబ భవిష్యత్తును గుర్తు చేసుకుని బాధ్యతగా వ్యవహరిస్తారని అన్నారు.

మీరు చేసే చిన్న తప్పు వల్ల కూడా కుటుంబం రోడ్డుపాలయ్యే పరిస్థితి రావచ్చనే అవగాహన కలిగి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కొంతమంది ఆటో డ్రైవర్ల తప్పు ప్రవర్తన వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే ఆటోకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, ప్రతి డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వర్తించాలంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాల్సి ఉంటుందని, అందరూ అవసరమైన అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.