27 May, 2026 | 12:59 AM

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

27-05-2026 12:00 AM

కోదాడ (మునగాల)మే 26: మునగాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత, ఐసీడీఎస్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించచారు.

జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ చైతన్య హాజరై మాట్లాడుతూ, సమాజానికి శాపంగా మారిన బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికలు శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని, వారి చదువు మధ్యలోనే ఆగిపోయి భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలికల రక్షణ, వారి హక్కుల కోసం ఏర్పాటు చేసిన ‘స్నేహ గ్రూపుల‘ ప్రాముఖ్యతను ఆమె వివరించారు. అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ, గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల శ్రీనివాస్ ఉపసర్పంచ్ పంచాయితీ సెక్రటరీ చంద్రశేఖర్ మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్ అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, కిషోర బాలికలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.