08-01-2026 05:42:02 PM
ఆదర్శలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి
కాటారం,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పూర్తిని అలవర్చుకోవాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవనాథ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ విద్య అనేది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని, సమాజంలో మంచి విలువలను అలవర్చుకొని దేశానికి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.
పరీక్షలను భయంగా కాకుండా అవకాశంగా చూసి, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి కాకుండా ప్రోత్సాహం, మార్గనిర్దేశం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రజ్ఞా వికాస్ ద్వారా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ట్రస్మ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, పాఠశాల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.