10 April, 2026 | 9:35 PM

సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవగాహన కార్యక్రమం

10-04-2026 07:42 PM

ప్రజలకు అవగాహన కల్పించిన డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి,(విజయక్రాంతి): సీజనల్ వాహక వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలను  బోడుప్పల్ సర్కిల్ ఏ ఎం ఓ హెచ్ డాక్టర్ ఏ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా 36వ రోజు  బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ నగర్, మల్లికార్జున్ నగర్ కాలనీలో సీజనల్ వాహక వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ హాజరై కాలనీ వాసులకు వాహక వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా, లైమ్ మొదలగు వ్యాధులు పరాన్న జీవులు, వైరస్లు, బ్యాక్టీరియా ల వల్ల దోమలు, ఈగలు మొదలగు వాహకాల ద్వారా మానవులకు సంక్రమిస్తాయని తెలిపారు. ప్రతి ఏటా 7 లక్షలకు పైగా మరణాలకు ఈ వ్యాధులు కారణం అవుతున్నాయని తెలియజేశారు. డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తున్నందున ఇట్టి దోమల ఉధృతిని తగ్గించుటకు ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో వెలువడిన చెత్తను రోడ్లపై పడవేయకుండా స్వచ్ఛ ఆటలకి అందివ్వాలని కోరారు.

ప్రతి ఇంటికి డోర్ మెస్ ను ఏర్పాటు చేసుకోవాలని, సాధ్యమైనంతవరకు వదులుగా ఉండే దుస్తులను ధరించాలని తెలియజేశారు. అవగాహన ర్యాలీ సందర్భంగా దేవేందర్ నగర్, మల్లికార్జున నగర్ కాలనీలలో దోమల నివారణ మందులు స్ప్రే చేయించడం జరిగిందని షెడ్యూల్ ప్రకారం ఫాగింగ్, చెరువుల్లో, నీటి నిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ప్రతి ఇంటికి స్ప్రే చేయడం వంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయన్నారు. ప్రజలందరూ ఇళ్లలో నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్త పడాలని వారంలో ఒకరోజు డ్రై డే గా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డి ఈ జాహ్నవి శశాంక్, ఏ ఈ మహేష్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సానిటరీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.