ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
- ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
బోధన్,(విజయక్రాంతి): ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తరిగిపోతున్న భూగర్భ జలాలు, సాగునీరు అందుబాటులో లేకపోవడం వలన వరి సాగు కష్టమవుతుందని ఎల్ నినో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు వేయడం వలన తక్కువ నీటి లభ్యతతో మంచి దిగుబడులు సాధించవచ్చు అని రుద్రూర్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సమతా పరమేశ్వరి సూచించారు. మందర్న గ్రామం, సాలూరా మండలంలోని గ్రామపంచాయతీ యందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులు ఆరుతడి పద్ధతిని అవలంబించాలని, నీటిని సమర్థవంతంగా, అవసరం మేరకు వినియోగించాలని శాస్త్రవేత్త రమ్య రాథోడ్ సూచించారు.
ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలలో చీడపీడల సమగ్ర యాజమాన్యానికి తీసుకోవలసిన చర్యలను శాస్త్రవేత్త సాయిచరణ్ సూచించారు. నీటి కొరత వలన ఇంకా ఇప్పటివరకు సాగు చేపట్టని రైతులు, ఆపత్కాల పంటలు సాగు చేయడం పంట మార్పిడితో నేల యొక్క ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వీలుగా ఆరుతడి పంటలైన కంది, పెసర, సజ్జ, రాగి, కొర్ర వంటి పంటలు వారి నేలలకు అనుగుణంగా సాగు చేసుకోవాలని సూచించడం జరిగింది.
రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్ర గంగాధర్, ఏఈవో ముజామిల్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం శాస్త్రవేత్తల బృందం రైతుల వరి, చెరకు మరియు సొయా చిక్కుడు పొలాలను సందర్శించి తగిన సూచనలు అందించారు.






