రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్ నిరసిస్తూ ఆందోళన
ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఢిల్లీలో విద్యార్ధుల నిరసనకు సంఘీభావంగా ప్రధాని మోదీ నివాసం ఎదుట శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల అరెస్ట్ అప్రజాస్వామికమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. పేపర్ లీకేజీ వల్ల 20 లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు.
లీకేజీ ఘటనతో దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్రం కోటి రూపాయల పరిహారాన్ని అందించి న్యాయం చేయాలన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్దుల, యువతపై లాఠీ చార్జి చేయడం, భాష్పవాయువు ప్రయోగించడం దారుణమన్నారు. ఘటనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నా ప్రధాని మంత్రి మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఘటనకు బాధ్యలపై చర్యలకు వెనుకాడుతున్నారన్నారు. లీకేజీ బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మంగేష్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ షాహిద్ అలీ, నాయకులు ముడుపు దామోదర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, భోజారెడ్డి, మునిగెల నర్సింగ్, బండారి సతీష్, కోలా నర్సింలు, గుడిపల్లి నగేష్, శాంతన్ రావు, నాగర్కర్ శంకర్, అల్చెట్టి నాగన్న, కౌన్సిలర్ మహబూబ్, బూర్ల శంకరయ్య, షబానా, సోనియా మంథని, కుదురుపాక సురేష్, జమున, ఎంఏ షకీల్, డేరా కృష్ణా రెడ్డి, ఖలీం, రామన్న, తదితరులు పాల్గొన్నారు.






