25 July, 2026 | 3:40 PM

రైతుల పొలాల పరిశీలన - సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలి

25-07-2026 03:10 PM

బోధన్,(విజయక్రాంతి): ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధనా స్థానం రుద్రూరు శాస్త్రవేత్తల బృందం హున్సా, మందర్న గ్రామం, సాలూర మండలంలోని వివిధ రైతుల పొలాలను సందర్శించడం జరిగింది. రైతులు సాగు చేస్తున్న వరి పొలాల్లో కాండం తొలిచే పురుగు ఉధృతి గమనించడం జరిగింది. ప్రస్తుతం అధికంగా నమోదవుతున్న దినం ఉష్ణోగ్రతలు, తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు కాండం తొలిచే పురుగుకు ఉధృతికి దోహదం చేస్తాయి. కాబట్టి నాట్లు వేసిన 25 రోజులకు రైతులు తప్పనిసరిగా కార్బోఫ్యూరాన్ 3జి ఎకరాకు పది కిలోల చొప్పున వేసుకోవాలి.

పొలంలో ఎకరాకు 5-6 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకుని పురుగుల ఉనికి ని గమనిస్తూ ఉండాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు చొప్పున పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించిన పొలంలో యూరియా వేయడం ఆపివేయాలి. వ్యాధి సోకిన మడి నుండి కింది పొలానికి నీరు వెళ్లకుండా చూడాలి వ్యాధి మరింత ఉధృతి అవ్వకుండా ప్లాంటమైసిన్ 80 గ్రాములు మరియు కాపర్ ఆక్సి క్లోరైడ్ 600 గ్రాములు ఒక ఎకరాకి పిచికారి చేసుకోవాలి.

చెరుకు సాగు చేస్తున్న రైతుల పొలంలో కాండం తొలిచే పురుగు ఉధృతి గమనించడం జరిగింది. నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిలి ప్రోల్ 150 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారి చేసి నియంత్రించవచ్చు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని పంట బెట్టకు గురికాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.