22-08-2025 12:28:29 AM
డిచ్ పల్లి ఆగస్టు 21: (విజయ్ క్రాంతి): డిచ్పల్లి మండల, ఖిల్లా డిచ్ పల్లి గ్రామ రైతులకి ఆయిల్ పామ్ సాగు పైన, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపైన మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఉద్యాన అధికారి రోహిత్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీ లతో సాగును ప్రోత్సహిస్తుందని,ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30సంవత్సరాల పాటు ఇస్తుందని,కోతులు ముట్టని, పందుల బెడద దొంగల బెడద లేని తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ అని పేర్కొన్నారు.
ఎన్‌ఎంఈఓ-ఓపి స్కీమ్ కింద ఈ కింది సబ్సిడీలు ఉన్నాయి. మొక్కలకు 90%రాయితీ కింద రైతు కేవలం ఒక ఎకరానికి 1000 చొప్పున జిల్లా ఉద్యాన, అలాగే పట్టుపరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు. ఆయిల్ పామ్ మధ్యలో అంతర పంటల సాగు(మొక్కజొన్న, జొన్న,పసుపు,కూరగాయలు,సోయా etc చేసినందుకు గాను ఎకరానికి 4200 రూ చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని చెప్పారు.
ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు, ఐదెకరాల లోపు ఉన్నవారికి 90% రాయితీ, ఎస్సీ/ఎస్ టి రైతులైతే 100 శాతం రాయితీ,5 ఎకరాల మీదా సాగు చేసేవారు 80 శాతం రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ లక్ష్మి ప్రసన్న,,పంచాయతీ సెక్రెటరీ వినయ్, ఖిల్లా టెంపుల్ చైర్మన్ శాంత్తయ్య, విడీసీ సభ్యులు కిషన్,సొసైటీ డైరెక్టర్ బుస నర్సయ్య,రైతులు నర్సారెడ్డి, రాజిరెడ్డి,ప్రి యూనిక్ కంపెనీ క్లస్టర్ ప్రతినిధి భూమేష్, పాల్గొన్నారు.