22 July, 2026 | 4:21 PM

గిరిజన ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత

22-07-2026 03:19 PM

* కట్టెల పొయ్యి పై వంటలు..

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ కొరత  వెంటాడుతుంది. ఉమ్మడి జిల్లాలోని 124 ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యసించే 39 వేల విద్యార్థులకు సరిపడ గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు కట్టెల పొయ్యిపై  వంటలు చేసే విద్యార్థులకు అందిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో   ఒక్కో 150 మంది విద్యార్థుల నుండి  550 వరకు గిరిజన విద్యార్థులు మూడవ తరగతి నుండి  పదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు.

వీరికి ప్రతిరోజు  ప్రభుత్వ  మెనూ ప్రకారం  ఉదయం అల్పాహారం తో పాటు  మధ్యాహ్నం సాయంత్రం  భోజనాలు  వంట చేసేందుకు  ఒక గ్యాస్ బుడ్డి సరిపోవడంలేదని  ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  150 మంది  విద్యార్థులు ఉన్న ఆశ్రమ పాఠశాలకు  గ్యాస్ బుడ్డి రెండు రోజులు వస్తుందని, 500 పైగా ఉన్న  ఆశ్రమ పాఠశాలలో రోజుకు రెండు నుంచి మూడు గ్యాస్ బుడ్డీలు  అవసరమని  నిర్వాహకులు అంటున్నారు . గ్యాస్ బుడ్డిల కొరకు  దొరికిన చోటుకు పరుగులు తీయవలసిన పరిస్థితి  ఉందని ఆశ్రమ పాఠశాల నిర్వాకులు  వాపోతున్నారు.. ఇప్పటికైనా గతంలో మాదిరిగా విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా  గ్యాస్ బుడ్డిలను సరఫరా చేయాలని  ఆశ్రమ పాఠశాలకు నిర్వాహకులు  కోరుతున్నారు.

* కట్టెల పొయ్యి పై వంటకాలు

ఆశ్రమ పాఠశాలలో  విద్యలభ్యసించి  విద్యార్థుల కోసం మూడు సమయాల్లో వంట చేసేందుకు గ్యాస్ సరిపోకపోవడంతో  కట్టెల పొయ్యి పై  వంటలు చేసి విద్యార్థులకు అందించవలసిన పరిస్థితి  ఆశ్రమ పాఠశాలలో  నెలకొంది. గత ఏడాది వరకు ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా  గ్యాస్ బుడ్డీలు  అందుతుండేవని, ప్రస్తుతం రెండు రోజులకు ఒక గ్యాస్ బుడ్డి కూడా  దొరకడం కష్టంగా ఉందని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు  వాపోతున్నారు.

విద్యార్థులకు సరియైన సమయంలో భోజనం, ప్రభుత్వ మెనూ ప్రకారం  భోజనాలు వడ్డించుటకు  కట్టెలను ఆశ్రయించవలసి వస్తుందని  నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కట్టెల కోసం  రోజువారి కూలీలకు  కట్టెలు తీసుకువచ్చేందుకు  డబ్బులు చెల్లించి తెప్పించవలసిన పరిస్థితి ఏర్పడిందని  నిర్వాహకులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో పాటు  ఐటిడిఏ అధికారులు  గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్యాస్ కొరతపై  డిటిడబ్ల్యూ ఓ ను వివరణ కోరెందుకు ప్రయత్నించగా చరవాలని  లిఫ్ట్ చేయలేదు.