22 April, 2026 | 3:09 AM

జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆయుషి

22-04-2026 01:26 AM

హైదరాబాద్, ఏప్రిల్ 21: గత కొంతకాలంగా తెలంగాణలో పవర్ లిఫ్టింగ్ క్రీడపై ఆసక్తి పెరుగుతోంది. మొదట్లో వ్యాయామంలో భాగంగా దీనిని చేసినా ఇప్పుడు పవర్ లిఫ్టింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు పవర్ లిఫ్టింగ్ నేర్చుకోవడమే కాదు దానిలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ళ ఆయుషి ప్రజాపతి ఈ క్రీడలో సత్తా చాటుతోంది. జాతీయ స్థాయి పోటీల కోసం తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన క్లాసిక్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 63 కేజీల విభాగంలో అగ్రస్థానం సాధించింది.

తద్వారా వచ్చే నెలలో కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా జరగబోయే జాతీయ సబ్ జూనియర్, జూనియర్ మెన్ అండ్ వుమెన్ పోటీలకు ఎంపికైంది. ఆయుషి ప్రజాపతి జాతీయ స్థాయిలో పోటీల్లో జూనియర్ కేటగిరీలో పాల్గొనబోతోంది. దుర్గానగర్‌లోని యాక్టిన్ ఫిట్‌నెస్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్న ఆయుషి గత కొంతకాలంగా ఈ పోటీల కోసం కఠోరంగా శ్రమిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకం అందించడమే తన లక్ష్యమని ఆయుషి చెబుతోంది.