బాబోయ్ దొంగలు
పట్టపగలు రెండు ఇళ్లలో చోరీ
15.5 తులాల బంగారు నగలు అపహరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (విజయక్రాంతి): నగరంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లోకి చొరబడి అందినకాడికి దోచుకొని పారి పోయారు. ఈ సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన షేక్ హసీన్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తన బంధువుల ఇంటికి వెళ్లి, తిరిగి నాలుగు గంటల ప్రాంతంలో వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలోని మూడున్నర తులాల బంగారు నగలతో పాటు రూ. 2.7 లక్షల నగదును గుర్తు తెలియని దొంగలు దోచుకొని పోయారు.
అదే ప్రాంతానికి సమీపంలో ఉన్న కోమటికుంట ప్రాంతం లో నివసించే హైమద్ హుస్సేన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహి స్తున్నాడు. ఉదయం 11 గంటలకు ఆఫీస్‌కి వెళ్లి తిరిగి 6 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో చూడగా 12 తులాల బంగారు నగలతో పాటు రూ.3 లక్షల నగదు కనబడలేదు. దీంతో బాధితులు స్థానిక హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




