5 April, 2026 | 8:20 PM

బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం

05-04-2026 02:37 PM

- మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ టౌన్: నవ భారత నిర్మాత, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగజీవన్ రామ్ ఆశయాలను సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు తెలిపారు. జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం కొల్లాపూర్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జగజ్జీవన్ రామ్ ఒక వర్గానికే పరిమితమైన నేత కాదని, దేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు.

సమానత్వం కోసం ఆయన జీవితాంతం పోరాటం చేశారని, అంటరానితనం మరియు కుల వివక్ష నిర్మూలనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా దేశంలో హరిత విప్లవం విజయవంతం కావడానికి ఆయన కీలక పాత్ర పోషించారని, అలాగే 1971 భారత్–పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా వ్యూహాత్మక నాయకత్వం ప్రదర్శించారని మంత్రి గుర్తు చేశారు. అణగారిన వర్గాల యువత ఉన్నత విద్యతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. సామాజిక న్యాయం సాధించడమే బాబూజీకి ఇచ్చే నిజమైన నివాళి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.