సన్నీ లియోన్‌కు చుక్కెదురు
అందాల తార సన్నీ లియోన్‌కు చుక్కెదురైంది. ఆమె నిర్వహించతల పెట్టిన ఓ ప్రదర్శనకు కేరళ విశ్వవిద్యాలయం అనుమతి నిరాకరించింది. గతంలో చోటుచేసుకున్న విషాద ఘటనలను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూలై 5న తిరువనంతపురంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో సన్నీ లియోన్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించాలని భావించింది. అయితే, ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వవద్దంటూ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్.. సంబంధిత రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
నిరుడు ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్ వర్సిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సన్నీ లియోన్ పాల్గొనగా, అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనను కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అది పూర్తిగా నిర్వహణ వైఫల్యమేనంటూ మొట్టి కాయలు వేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆదేశించింది. ఇప్పటికే తెలుగు సహా పలు భారతీయ సినిమాల్లో నటించిన సన్నీ లియోన్.. త్వరలో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది.






