16 July, 2026 | 4:40 PM

‘బుజ్జి’తో మహీంద్రా గ్రూప్ చైర్మన్

13-06-2024 04:05 AM

ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం ప్రత్యేకించి తయారు చేసిన బుజ్జి అనే వాహనం రూపకల్పనలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పాత్ర గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ పలుమార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం బుజ్జి దేశంలోని పలు నగరాల్లో షికార్లు చేస్తోంది. ఈ క్రమంలో బుజ్జిని ఆనంద్ మహీంద్రా కలవగా, వాహనాన్ని పరిశీలించిన అనంతరం కాసేపు ఆయన సరదాగా నడిపారు. ఈ సందర్భంగా ‘బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా’ అంటూ ఆనంద్ మహీంద్రా బుజ్జిని నడుపుతున్న వీడియోలు, ఫొటోలను చిత్ర నిర్మాణ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాయి.

‘ఈ కారును డిజైన్ చేయడానికి ఇంజినీరింగ్ సబ్జెక్టులు చదవాల్సి వచ్చింది’ అని దర్శకుడు చెప్పిన దాన్ని బట్టి, బుజ్జికి తుది రూపు ఇవ్వడం కోసం ఆయన ఎంత పరిశోధన చేసి ఉంటారో వేరే చెప్పక్కర్లేదు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలైన మహీంద్రా, జయం మోటార్స్ (కోయంబత్తూర్) నిర్మాణంలో ఈ వాహనం ప్రస్తుత రూపాన్ని సంతరించుకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఈ వాహనం చేసిన విన్యాసాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ తెరకె క్కించిన ‘కల్కి’ చిత్రం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.