18 July, 2026 | 8:55 AM

కవితకు మళ్లీ చుక్కెదురు

02-07-2024 01:26 AM
  • బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
  • సీబీఐ, ఈడీ కస్టడీ నుంచి ఉపశమనం కోరుతూ ఎమ్మెల్సీ పిటిషన్లు
  • ఇంకొంతకాలం జైళ్లోనే..

న్యూఢిల్లీ, జూలై 1: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె మే 28న దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం వెల్లడించింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌పై మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా కవితను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేశారని, ఒక పార్టీకి కీలక నేతగా ఉన్నా ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారంటూ కవిత తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ, సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత కీలక సూత్రధారి అని కోర్టు తెలిపారు. ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు.

అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరా రు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది. మద్యం కేసులో కవితపై వచ్చిన ఆరోపణలో నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15న ఆమెను ఈడీ అరెస్ట్ చేసిఇంది. తొలుత ఈడీ కస్టడీ, తర్వాత జ్యుడీషియల్ కస్టడీ ఎదుర్కొన్న ఆమె.. ఏప్రిల్‌లో సీబీఐ రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత సీబీఐ కూడా ఆమెను అరెస్టు చేసింది. తర్వాత కోర్టులో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్‌ను విధించింది. ప్రస్తుతం కవిత జ్యుడీషి యల్ కస్టడీలో ఉన్నారు.