18 July, 2026 | 9:09 AM

నిరసన తెలిపితే తప్పా?

02-07-2024 01:19 AM

  • నిరసనకారులపై లాఠీచార్జి సిగ్గుచేటు
  • బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం
    • రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): నిరుద్యోగులు తమ హక్కు లను డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టే హక్కు లేదా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జి చేశారని, ఆ చర్య సిగ్గుచేటని మండిపడ్డారు. సర్కార్ ఆదేశాల మేరకే పోలీసులు ఆందోళనకారులను తరుముతూ చేయి చేసుకున్నారన్నారు.

నిరసనకారుడు మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాకేష్‌రెడ్డి సహా పలువురిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. వారు నిరసనకారులను కలిసేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. పార్టీ నాయకులందరినీ పోలీసులు బేషరతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు సంఘీభావం తెలపడంలో తప్పేమిటని నిప్పులు చెరిగారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను సర్కార్ పట్టించుకోకపోతే మున్ముందు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.