లెక్కా పత్రంలేని తరలింపులు
- పేరుకే మిల్లులకు ధాన్యం షిప్టింగ్ పూర్తి
- అక్నాలెడ్జ్‌మెంటు ఇవ్వని ఏజెన్సీలు
- ధాన్యం వెళ్లింది మిల్లులకేనా..?
- 2021 యాసంగి ధాన్యం 23,955.920 టన్నులు
- కొనసాగుతున్న 2022 యాసంగి ధాన్యం షిప్టింగ్
మంచిర్యాల, జూలై 1 (విజయక్రాంతి): ధాన్యం నిల్వ, మిల్లింగ్, సీఎంఆర్ బియ్యం సరఫరాలో రకరకాల లీలలు వెలుగు చూస్తున్నాయి. చాలా మిల్లుల్లో ధాన్యం మాయమైతది. ఉన్న కాస్తోకూస్తో గోదాముల్లో ముక్కిపోతది. అధికారులు పట్టించుకొనేది లేదు.. ప్రభుత్వం లెక్కలు అడిగేది లేదు అన్నట్టుగా మారింది పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో 2021 2022 యాసంగి సీజన్‌న్లలో వరి ధాన్యం పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చింది.
పౌరసరఫరాల శాఖ అధికారులు కొంతవరకు మిల్లులకు తరలించారు. మిగిలిన ధాన్యాన్ని జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాముల్లో ఏజెన్సీలను బాధ్యులను చేస్తూ దించిపించారు. కోట్ల విలువైన ఈ ధాన్యం అప్పటి నుంచి గోదాముల్లో మగ్గిపోతున్నది. దీనిపై సివిల్ సప్లయ్ కమిషనర్ జిల్లా ఇటీవల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసి ధాన్యాన్ని వెంటనే గోదాముల్లోంచి తరలించాలని ఆదేశించారు. 2021 యాసంగి సీజన్ ధాన్యాన్ని మిల్లులకు, 2022 ధాన్యాన్ని టెండర్‌లో పాడుకున్నవారికి పంపించాలని సూచించారు.
23,955.920 మెట్రిక్ టన్నులు
2021 యాసంగి సీజన్‌లో ధాన్యం పెద్ద మొత్తంలో రావడంతో సివిల్ సప్లయ్ అధికారులు ఆయా ఏజెన్సీలతో మాట్లాడి మార్కెట్ కమిటీ గోదాముల్లో ఆయా ఏజెన్సీల ఇంటర్మీడియట్ గోదాముల పేరిట ధాన్యం నిలువ చేయించారు. దీంతో డీసీఎంఎస్ ఏజెన్సీ భీమారం, కోటపల్లి, లింగాపూర్ ఇంటర్మీడియట్ గోదాముల్లో 4,404 మెట్రిక్ టన్నులు, డీఆర్‌డీఏ ఐకేపీ భీమారం, చెన్నూర్, జన్నారం, వేమనపల్లి ఇంటర్మీడియట్ గోదాముల్లో 7,859.080 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఏజెన్సీ చెన్నూర్, జన్నారం, కాసిపేట, రేచిని, వేమనపల్లి ఇంటర్మీడియట్ గోదాముల్లో 11,692.840 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచారు. ఆ ధాన్యాన్ని మూడు నెలల్లోనే మిల్లులకు కేటాయించాల్సి ఉండగా సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యంతో గోదాముల్లోనే ఉండిపోయింది. ఇటీవలే దానిని మిల్లులకు తరలించారు.
అక్నాలెడ్జ్‌మెంటు ఇవ్వని ఏజెన్సీలు
2021 యాసంగి సీజన్‌కు సంబంధించి 12 గోదాముల్లోని డీఆర్‌డీఏ (ఐకేపీ), పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని 23,955.920 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలోని కొన్ని మిల్లులకు, పెద్దపల్లి జిల్లాలోని రెండు మిల్లులకు పంపారు. కానీ ఇంతవరకు ధాన్యం దించుకున్న మిల్లర్లు తమకు ఇంత ధాన్యం వచ్చినట్టు అక్నాలెడ్జ్‌మెంటు (మిల్లర్ రిసీవ్డ్) కాపీ ఏజెన్సీలకు, సివిల్ సప్లయ్ అధికారులకు ఇవ్వలేదు. దీంతో గోదాముల నుంచి వెళ్లిన ధాన్యం మిల్లులకే పోయిందా? లేదా బయటకు వెళ్లిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల విలువచేసే ధాన్యం మిల్లుల్లో దిగితే మిల్లర్ రిసీవ్డ్ కాపీ ఎందుకివ్వడం లేదు? ఏజెన్సీల బాధ్యులు కానీ, సివిల్ సప్లయ్ అధికారులు కానీ దీనిపై ఎందుకు దృష్టి సారించడం లేదో వారికే తెలియాలి.
కొనసాగుతున్న 2022 యాసంగి ధాన్యం షిప్టింగ్
2022-23 యాసంగికి సంబంధించిన 9౩09.520 టన్నుల ధాన్యాన్ని మార్కెట్ కమిటీ, సివిల్ సప్లయ్ ఆధ్వర్యంలో ఉన్న ఏడు గోదాముల్లో నిల్వ చేశారు. ఇందులో డీసీఎంఎస్ ఏజెన్సీ తీగల్‌పహాడ్, వేమనపల్లి ఇంటర్మీడియట్ గోదాముల్లో 3192.480 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఏజెన్సీ చెన్నూర్, వేమనపల్లి, కాసిపేట, తీగల్‌పహాడ్ ఇంటర్మీడియట్ గోదాముల్లో 4681.280 మెట్రిక్ టన్నులు, డీఆర్‌డీఏ ఏజెన్సీ భీమారం మార్కెట్ కమిటీ ఇంటర్మీడియట్ గోదాముల్లో 1435.760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దించారు.
ఈ ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేయగా దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు మొదటి విడత డీఆర్‌డీఏకు సంబంధించి 500 మెట్రిక్ టన్నులు భీమారం గోదాం నుంచి తీసుకుపోయేందుకు సివిల్ సప్లయ్ అధికారులు అనుమతి (ప్రొసీడింగ్) ఇవ్వగా ఆ ధాన్యాన్ని సదరు కాంట్రాక్టర్ తీసుకువెళ్లాడు. వీటికి సంబంధించి ట్రక్‌షీట్ (రిసీవ్డ్) కాపీలను లోడింగ్ అయిన వెంటనే ఇచ్చి తీసుకువెళుతున్నారు. ఒక ధాన్యం బస్తా 40.650 కిలోలు ఉండాలి. కానీ, ప్రస్తుతం అవి 38, 39 కిలోలే తూకం వస్తున్నాయి. గోదాంలోని పూర్తి ధాన్యం షిప్ట్ అయితే వ్యత్యాసం ఎంత వస్తుందో తేలుతుంది.






