30-10-2025 10:43:03 AM
అసూయతోనే అనవసర విమర్శలు
టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి
సంగారెడ్డి,(విజయక్రాంతి): హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో(Hyderabad Press Club election) టియుడబ్ల్యూ జే ఐజేయు బలపరిచిన విజయ్ కుమార్ రెడ్డి ఫ్రెండ్స్ ప్యానెల్ ఘన విజయం సాధించడంతో కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీపై దుష్ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ ఆరోపించారు. ఫ్రెండ్స్ ప్యానల్ కు తమ సంఘం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిందని, అంతేకాకుండా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ మద్దతును కూడగట్టుకోవడం ద్వారా ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నదని తెలిపారు. అయితే ఈ విజయం సందర్భంగా కొందరి కుట్రలను ఉద్దేశించి మాత్రమే విరాహత్ అలీ వ్యాఖ్యానించారని బండారు యాదగిరి పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల సమయంలో అనేకమంది అనేక విధాలుగా కుట్రలు చేసిన సంగతి అందరికీ తెలుసునని అన్నారు.అయినప్పటికీ టియుడబ్ల్యూజే బలపరిచిన ప్యానెల్ ను ఏకపక్షంగా జర్నలిస్టులు గెలిపించారని తెలిపారు. ఈ గెలుపును జీర్ణించుకోలేకపోవడం వల్లనే కొందరు వ్యక్తులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, పెడా
ర్థాలు తీస్తున్నారని ఆరోపించారు.జర్నలిస్టుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని యాదగిరి పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం టి యు డబ్ల్యూజే (ఐ జె యు) పక్షాన విరాహాత్ అలీ ప్రతిక్షణం పోరాడుతున్నారని తెలిపారు. ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మడమ తిప్పకుండా హక్కులను సాధించారని వివరించారు. గ్రామీణ జర్నలిస్టులతో పాటు పట్టణ ప్రాంత జర్నలిస్టుల సంక్షేమానికి అంది వచ్చిన అన్ని మార్గాల ద్వారా సాధించారని చెప్పారు. సాధారణ జర్నలిస్టుగా వచ్చి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎదిగారంటేనే ఎంత నిబద్ధత ఉన్నదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.జర్నలిస్టుల హక్కుల సాధనలో రాజీ లేకుండా పోరాడుతున్నందు వల్లనే.. జర్నలిస్టులు అందరి మద్దతును ఆయన పొందగలుగుతున్నారని వివరించారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఓటమిని హుందాగా స్వీకరించకుండా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఇలాంటి ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలనుకుంటే కుదరదని తెలిపారు.జర్నలిస్టులు సహించబోరని ఆయన అన్నారు. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే విజయ్ కుమార్ రెడ్డి విజయాన్ని క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు నిరంతరం పాటుపడుతున్న విరాహత్ అలీని క్షమాపణ కోరడం సరికాదని యాదగిరి అన్నారు.