calender_icon.png 24 February, 2026 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్మెరలో కులోన్మాదం కాటు భగ్గుమన్న బహుజనులు

24-02-2026 01:51:27 AM

పసికందు ప్రాణం బలి..

  1. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
  2. పోలీసుల వ్యవహార శైలిపై అనుమానాలు

* రాయలసీమలో పగలు పడగెత్తినప్పుడు మహిళలు, పసి పిల్లలపై మారణాయుధాలు లేవలేదు.. ఆంధ్రాలో కులకత్తుల కోలాటాల్లో పసిబిడ్డల కుత్తుకలు తెగలేదు.. తెలంగాణ రాష్ట్ర చరిత్రపై ఇప్పుడు మరకపడింది. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో ఈనెల 18న  ఓ రజక కుటుంబంపై రెడ్డి సామాజికవర్గంవారు మూకుమ్మడిగా జరిపిన దాష్టీకం, బహుజనవర్గాలను రగిలించింది.

రెడ్డి సామాజికవర్గం దాడిలో రెండునెలల పసిగుడ్డు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఆగ్రహ జ్వాలలను రేపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలు ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గళమెత్తాయి. కుమ్మెర గ్రామ రెడ్ల పెత్తనంపై ఎల్లెడలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాగర్‌కర్నూల్ ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : నాగర్‌కర్నూల్ జిల్లా లోని కుమ్మెర గట్టు మల్లన్న జాతర ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల నుంచి నిరసన గళాలు పెళ్లుబుకుతున్నాయి. జాతరలో దైవదర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన దంపతులకు రెడ్డి సామాజికవర్గం వారి చేతిలో చేదు అనుభవం ఎదురైంది.

దైవదర్శనం కోసం డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన పాపానికి, తక్కువ కులం వాళ్లు ప్రశ్నించే స్థాయికి ఎదిగారా.. అంటూ ఎనిమిది మంది రెడ్డి సామాజికవర్గం వారు మూకుమ్మడిగా దాడికి పాల్పడి రెండు నెలల పసిబిడ్డను పొట్టన పెట్టుకున్నారని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తే అక్కడ కూడా అవమానాలు తప్పలేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.

ఈ ఘటనపై పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ సంఘా లు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచాయి. దుండగులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఆయా రూపాల్లో తమ నిరసన గళాన్ని వినిపిస్త్త్తున్నాయి. అయినా ఇప్పటివరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి నిందితులపై చర్యలు తీసుకునేందుకు పోలీ సులు వెనకడుగు వేయడానికి రాజకీయ కారణాలే ఉన్నాయంటూ పోలీసుల తీరును విమర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో రెడ్డి రాజ్యం సాగుతోందని ప్రజాసంఘాలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతుండగా.. అధికారపక్షం మాత్రం ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తమ ఉనికి కోసం ఆందోళనలు చేస్తున్నాయని చెబుతున్నది. దీంతో కుమ్మెర గట్టు పంచాయతీ రాజకీయ రంగు పులుముకుంది. 

కుమ్మెర గట్టు జాతరలో రెడ్ల పెత్తనం..

ఏటా మహాశివరాత్రి అనంతరం జరిగే కుమ్మెర గట్టు మల్లన్న జాతరలో కుమ్మెర గ్రామ రెడ్ల పెత్తనమే నడుస్తోందని, మల్లన్న స్వామి పేరుతో భక్తుల నుంచి.. చిరు వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటు న్నారని విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఆలయ అభివృద్ధి పేరుతో దోచుకుంటున్న నిధులన్నీ గ్రామస్థాయి నుంచి జిల్లా ఉన్నత స్థాయి అధికారుల వరకు పంపకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి

ఈ నేపథ్యంలోనే పోలీసులు వారపై మమకారం చూపుతున్నారన్న విమర్శలు వ ్యక్తమ వుతున్నాయి. ప్రస్తుతం దర్శనం కోసం రూ.వంద టికెట్ పేరుతో వసూళ్లను సహించలేని ఓ రజక కుటుంబం ప్ర శ్నించినందుకే దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. ఒక్కో భక్తుడి నుంచి వంద రూపాయలు, చిరు వ్యాపారుల నుంచి వెయ్యి చొప్పున వసూ లు చేయడంతో ఐదు రోజులు జరిగే ఈ జాతర పేరుతో పెద్దఎత్తున డ బ్బులు పోగుచే సుకుం టున్నారనే వాద న వినిపిస్తోంది. 

పెళ్లుబికిన నిరసన..

శిశువు మృతి ఘటనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాల నుం చి ఆగ్రహం వ్యక్తమవుతోంది. శనివారం డీఎ స్పీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ ప్రధాన రహదారిపై బైఠాయించి బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నా చేపట్టారు. అనంతరం ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు బాధిత కుటుంబానికి అండగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.

18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ క్రాంతి దళ్ వ్యవ స్థాపకులు పృథ్వీరాజ్, ఇతర ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద రో డ్డుపై బైఠాయించారు. చివరగా సోమవారం అధికార పార్టీ ముఖ్య నేతలు సైతం బాధ్యత కుటుంబానికి అండగా నిలుస్తున్నట్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

పోలీసు కోర్టులోనే బంతి

ప్రస్తుతం దాడి ఘటన నేపథ్యం లో రెండు నెలల శిశువు మృతి చెందింది. ఈ ఘటనకు కారణమైన నిందితులను శిక్షించాలంటే పోలీసులపై రాజకీయ ఒత్తిడులు వస్తున్నా యని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో సోమవారం అధికార పార్టీ నేతలు సైతం పోలీసులకు పూర్తిస్థాయి ఆదేశాలిస్తూ నిందితులను శిక్షించాలని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. దాడిలో 8 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నప్పటికీ కేవలం నలుగురిని మాత్రమే రిమాండ్ చేసినట్లు చెప్తున్నారు. హత్యాయత్నం కేసులతో పాటు హత్యా నేరం కేసు కూడా నమోదు చేసి శిక్షించాలని చేస్తున్న డిమాండ్ పూర్తిస్థాయిలో నెరవేరుతుందా అనేది వేచి చూడాలి.

ఆరోజు ఏం జరిగింది..

ఈనెల 18న గ్రామానికి చెందిన చంద్రకళ, కీర్తి, గణేశ్, మౌనిక మల్లన్న దర్శనం కోసం జాతరకు వెళ్లారు. రూ. 100 ఎంట్రీ టికెట్ విషయంలో రెడ్డి సామాజికవర్గం నిర్వాహకులకు, బీసీ సామాజికవర్గం భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంత రం గణేష్ సోషల్ మీడియాలో రెడ్డి సామాజికవర్గాన్ని ఉద్దేశించి పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనై గణేశ్, చంద్రకళపై రెడ్డి సామాజికవర్గానికి చెందిన 8 మంది నిర్వాహకులు.. ఆలయం పక్కన కొబ్బరికాయల గదిలో వారిని బందించి మూకుమ్మడిగా చితకబాదారు.

విషయం తెలుసుకున్న గణేష్ భార్య మౌనిక తన రెండు నెలల చంటి బిడ్డతో కలిసి వారి కాళ్లపై పడి ప్రాధేయపడింది. పసికందు అని కూడా చూడకుండా రెడ్డి సామాజికవర్గం వారు ఆ చంటి బిడ్డను తన్నారని, తల గోడకు తగిలి ఆ పసికందు చివరికి ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబం వలవల ఏడుస్తోంది. అనంతరం డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో వారు నేరుగా పోలీస్‌స్టేషన్ చేరుకొని ఫిర్యాదు చేశారు.

బాధిత బీసీ కుటుంబాన్ని అక్కడే పోలీస్‌స్టేషన్ బయట నిలబెట్టి.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి ఫోన్ చేసి మరీ పిలిపించి వారి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసినట్లు బాధితులు ఆరోపించారు కానీ తాము ఇచ్చిన ఫిర్యాదు మాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. రెడ్డి సామాజికవర్గంవారి దెబ్బలకు అస్వస్థతకు గురైన ఆ పసిబిడ్డ ఈనెల 21న మరణించిందని, దీనిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

దాడి కారణంగా కాకుండా వేరే కారణంతో మరణించి ఉండవచ్చని పోలీసులు తమనే బెదిరింపులకు గురిచేశారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలో రెడ్డి వర్గంలోని ఒక వ్యక్తికి గాయాలు అయ్యాయన్న సాకుతో వారిచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై కేసులు నమోదు చేశారని బాధితులు ఆరోపించారు. కానీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం కోర్టు అనుమతి కోసం పంపామని చెప్పడంతో పోలీసుల వ్యవహార శైలి పట్ల అనుమానాలు పెరుగుతున్నాయని ప్రజాసంఘాల నేతలు పేర్కొన్నారు.