కవితకు బెయిల్
షరతులతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- 5 నెలలుగా జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ
- ఈడీ, సీబీఐ తీరుపై ధర్మాసనం అసహనం
- వాంగ్మూలాలనే ఆధారాలుగా ఎలా చూపిస్తారని ప్రశ్న
- నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మండిపాటు
- ఫోన్ డాటా తొలగింపు వ్యక్తిగతమేనని వ్యాఖ్య
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు సుమారు గంటన్నరపాటు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
పిళ్లును బెదిరించి..
విచారణ సందర్భంగా లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని చెప్పేందుకు ఆధారాలేమున్నాయని ఈడీ, సీబీఐలను ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏఎస్‌జీ బదులిస్తూ.. అప్రూవర్లుగా మారిన బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఆధారాలను ప్రస్తావిం చారు. కవిత బెదిరింపుల వల్లనే అరుణ్ పిళ్లు తన వాంగ్మూలాన్ని 120 రోజుల తర్వాత విత్‌డ్రా చేసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఆమెను విచారణకు పిలిచిన సమయంలోనే పిళ్లు తన స్టేట్‌మెం ట్‌ను ఉపసంహరించుకున్నారని, దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. రూ.100 కోట్లను ఆప్ పార్టీకి ఇవ్వడంలో కవితది కీలక పాత్ర అని, ఈ విషయంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి వాంగ్మూలం ఇచ్చారని పేర్కొంది.
ఈడీ, సీబీఐపై సుప్రీం అసహనం
దీనిపై ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుని వాళ్లు ఇచ్చిన స్టేట్‌మెంట్లనే ఆధారాలనే ఇత ర కేసుల్లో ప్రస్తావించారని గుర్తుచేశారు. మొదట మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌ను సూత్రధారులుగా పేర్కొన్నారని, ఇప్పుడు కవిత సూత్రధారి అని చెబుతున్నారని.. కానీ ఇందులో వాంగ్మూలాలు తప్ప ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశారని, దర్యాప్తు కూడా పూర్తయిందని పేర్కొ న్నారు. కానీ సిసోడియాకు లభించిన బెయి ల్ కవితకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
5 నెలలకుపైగా ఈడీ, 4 నెలలుగా సీబీఐ కేసులో కవిత జైలులో ఉన్నారని, రూ. 100 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించినా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారని తెలిపారు. దీంతో ఈడీ, సీబీఐ తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ల నిష్పక్షపాత వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. వ్యక్తులను ఎంపిక చేసుకుని నిందితులుగా పేర్కొంటారా? అని నిలదీసిం ది. అప్రూవర్లుగా మారినవారి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని నిందితులుగా చూస్తారా? అని ప్రశ్నించింది. పిళ్లు సీబీఐ కస్టడీలో ఉంటే కవిత ఎలా బెదిరిస్తారని ఎదు రు ప్రశ్నించింది. మాగుంటను ముద్దాయిగా ఎందుకు చేర్చలేదని అడిగింది. ఇందులో న్యాయమెక్కడుందని మందలించింది.
జైలువద్దకు బీఆర్‌ఎస్ నేతలు
కవితకు బెయిల్ వస్తుందనే నమ్మకంతో కేటీఆర్, హారీశ్‌రావుతో సహా పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకు లు తరలివెళ్లారు. రాత్రి 8 గంటల వరకు వేచి చూసిన నేతలు ఆమె బయటకు రాగానే తెలంగాణ నినాదాలతో స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపారు.
డాటా ఫార్మాట్ వ్యక్తిగతం
అయితే కవిత తన ఫోన్‌లో డాటా ను ఫార్మాట్ చేశారని, సాక్ష్యాధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారని సీబీఐ వాదించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేశారని, యాపిల్ ఫేస్‌టైంలో డాటా ఎలా మాయమైందంటూ ఈడీ అడిగింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఫోన్ లో మెస్సేజులు తొలగించడం సహజమని పేర్కొంది. నేరం నిరూపించడానికి ఆధారాలు ఏవని ప్రశ్నిస్తూనే మొబైల్ లో మెస్సేజులు తొలగించడం వ్యక్తిగత అంశమని బెంచ్ స్పష్టం చేసింది. కేవ లం ఫోన్‌ను ఫార్మాట్ చేసినంత మాత్రా న నేరం చేసినట్లు భావించలేమని తెలిపింది. నేర నిరూపణకు అదనపు సమా చారం కావాలని, అంతేకానీ ఇది వ్యక్తిగతమేనని బెంచ్ పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసింది.
షరతులివే..
- ఒక్కో కేసులో రూ.10 లక్షల పూచీకత్తు
- రెండు ష్యూరిటీల సమర్పణ
- పాస్‌పోర్టు కోర్టుకు సరెండర్ చేయాలి
- సాక్షులను ప్రభావితం చేయకూడదు
- మద్యం కుంభకోణం కేసు విచారణకు సహకరించాలి




