మాయదారి ఎడారి.. కనిపించదు ఏ దారి!
- ప్రపంచంలోనే ప్రమాదకర ప్రాంతంగా రికార్డు
- మనుషులే కాదు ఒంటెలు కూడా కానరావు
- తెలంగాణ వ్యక్తిని మింగిన ‘రబ్ ఎడారి
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఎడారి అనగానే చుట్టూ ఇసుక ఉంటుంది. అక్కడకక్కడ ఒయాసిస్‌లు, ఒంటెలు ఇలా ఓ రూపం మన మెదడులోకి వస్తుంది. కానీ ఈ రబ్ ఎడారిలో మాత్రం ఇసుక తప్ప ఇంకేం కనిపించదు. ఒంటెలు, ఒయాసిస్‌లు అనేవి మచ్చుకూ కానరావు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన ఎడారి చెబుతారు. ఇది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 దేశాల్లో విస్తరించి ఉండడం గమనార్హం. ఈ ఎడారికి ఎమ్టీ క్వాటర్ అనే పేరు కూడా ఉంది. ఈ ఎడారిలో కనుక తప్పిపోతే వెనక్కు రావడం అసాధ్యం.
రెండేళ్ల పాటు ఎడారిలో అధ్యయనం..
ఇటువంటి ఎడారిలో ప్రసిద్ధ అన్వేషకుడు విల్ఫ్రెడ్ థెసిగర్ ఏకంగా రెండేళ్లపాటు గడిపాడు. అంతేకాకుండా ఈ సమయంలో తన అనుభవాలను ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. తనకు బూట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చెప్పులు లేకుండా ఎడారిలో నడిచేందుకు మొగ్గు చూపాడు. కార్లు ఉన్నా కానీ ఎడారిలో ఒంటెల ద్వారా ప్రయాణం కొనసాగించాడు. ‘ఈ ఎడారిలో చిక్కుకోవడం బొడ్డు తానును కత్తిరించడం వంటిది. మీకు ఆహారం, ఆక్సిజన్ లేకుండా పోతుంది’ అని విల్ఫ్రెడ్ హెచ్చరించాడు.
పాపం షెహజాద్
తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన షెహజాద్ (27) మూడేళ్ల నుంచి సౌదీ అరేబియాలోని ఓ టెలికం కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు పని నిమిత్తం తన సహచర ఉద్యోగితో కలిసి రబ్ ఎడారికి వెళ్లగా.. జీపీఎస్ తప్పుగా చూపించడం వల్ల అతడు దారి తప్పిపోయాడు. అదే సమయంలో ఫోన్‌లో సిగ్నల్ కూడా లేదు.
వారు తీసుకెళ్లిన కారులో కూడా ఇంధనం అయిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఎడారిలో ఉన్నారు. ఆ ఎండ వేడిమికి తాళలేక నాలుగు రోజులకు షెహజాద్, అతడి సహచరుడు మరణించారు. వారు కనిపించట్లేదని కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెళ్లి వెతికిన పోలీసులకు ఇసుక దిబ్బల్లో వారి శవాలు దర్శనం ఇచ్చాయి. ఈ దెబ్బతో అత్యంత ప్రమాదకరమైన ఈ ఎడారి మరోసారి వార్తల్లో నిలిచింది.
ఎటు చూసినా ఇసుక దిబ్బలే
ఈ రబ్ ఎడారిలో ఎటు చూసినా కనుచూపు మేరలో ఇసుక దిబ్బలే దర్శనం ఇస్తాయి. ప్రపంచంలోనే అతి భయంకరమైన ఎడారిగా పేరున్న ఈ ఎడారి 2,50,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇప్పటి వరకు చరిత్రలో ముగ్గురంటే ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఎమ్టీ క్వాటర్ అని పిలవబడే ఈ ఎడారిని దాటి బతికి బట్టకట్టగలిగారు.




