ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్‌రావులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై బుధవారం ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వు చేసింది. అయితే ప్రస్తుతం కేసు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్డు నిందుతుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.
కాగా ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్‌లను విచారించాలని విదేశాల్లో ఉన్న వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని గతంలోనే విచారణ అధికారులు కోర్టును కోరగా, కోర్టు అందుకు అనుమతించింది. అయితే అనారోగ్య సమస్యల కారణంతో అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు జూన్ 26న ఇండియాకి వస్తానని గతంలో ఆయన తరపు లాయర్ కోర్టులో మెమోలు దాఖలు చేశారు. కానీ గడువు ముగిసిన ప్రభాకర్ రావు ఇండియాకి రాకపోవడంతో ఈ కేసులో విచారణ అధికారులు ఎలా ముందుకెళ్తారో తెలియాల్సి ఉంది.






