బక్రీద్ పండుగను సోదర భావంతో జరుపుకోవాలి
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతంలోని ఈమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ వంటి మూల స్తంభాలను పాటించడం గొప్ప విషయమన్నారు.
ముస్లింలు ఐక్యంగా, సోదర భావంతో ముందుకు సాగాలని త్యాగనిరతి, మానవత్వాన్ని చాటిచెప్పే పవిత్ర పండుగ బక్రీద్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, స్థానిక కౌన్సిలర్లు, మత పెద్దలు పాల్గొన్నారు.






