ఐక్యతకు వారధి బక్రీద్
- ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి
ఈ పర్వదినం త్యాగానికి ప్రతీక: రేవంత్‌రెడ్డి
ప్రవక్త ఆశీస్సులు అందరికీ ఉండాలి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఈద్ ఉల్ అదా సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ భక్తి స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. సేవ, త్యాగానికి నిదర్శనంగా నిలిచే బక్రీద్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యం, సహకారం, కరుణ, భక్తి, ఐక్యతకు బక్రీద్ వారధిగా నిలుస్తుందని తెలిపారు.
త్యాగానికి ప్రతీక: సీఎం
బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా ఉంటుందని, అల్లా ఆజ్ఞను శిరసావహించి ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్ తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని సీఎం గుర్తుచేశారు. ప్రవక్తల అచంచలమైన దైవభక్తి, త్యాగనిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ మానవాళికి గొప్ప సందేశం ఇస్తుందన్నారు. తమకు ఉన్నదాట్లోనే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటి చెబుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ప్రవక్త ఆశీస్సులు ఉండాలి..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన బక్రీద్ పండుగ త్యాగం, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలంతా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రవక్త ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలన్నారు.






