కొత్త గులాబీదళాలు!
నూతన కమిటీలపై బీఆర్‌ఎస్ అధినేత కసరత్తు
కత్తుల్లాంటి నాయకుల ఎంపికలో కేసీఆర్
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్‌ఎస్ తిరిగి పుంజుకునేందుకు వ్యుహాలకు పదును పెడుతోంది. నిరుత్సాహంలో ఉన్న క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి పలు కమిటీలకు బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అనుబంధ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్‌ను చురుకుగా చేయాలని భావిస్తోంది. క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పడు ప్రజల్లోకి తీసుకెళ్లాలా ప్లాన్ చేయబోతోంది.
జిల్లాల్లో బలమైన నేతలను గుర్తించి బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కమిటీలను 2022 జూన్‌లో ప్రకటించారు. ఇందులో ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షుల పార్టీ మారడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. జిల్లాలో పూర్తి స్థాయి కమిటీలను సైతం నియమించలేదు. 19 జిల్లాల్లో అధ్యక్ష బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పార్టీలో సీనియర్లు, ఉద్యమకారులు అసంతృప్తిగా ఉన్నారు. కొంతమంది పార్టీ వీడారు. ఈపార్టీ పరిణామం పార్టీని డ్యామేజ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ, యువత, రైతు, కార్మిక, విద్యార్థి, సోషల్ మీడియా కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు.
బాధ్యతలు లేకుండా పార్టీలో పనిచేస్తున్న నేతలు సైతం అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గం, మండల స్థాయిలో సైతం అధ్యక్షుడిని మాత్రమే నియమించి కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ ఇచ్చే కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ఆరేళ్ల కితం రాష్ట్ర కమిటీని 69 మంది సభ్యులతో ప్రకటించింది. ఆ కమిటీలో ఉన్నవారిలో కొంతమంది పార్టీని వీడారు. దీంతో అధిష్టానం రాష్ట్ర కమిటీ కూర్పుపై దృష్టి సారించలేదు. సీనియర్ నేతలకు అవకాశం కల్పించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత రాష్ట్ర కమిటీ సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదు.
విస్తృతస్థాయి సమావేశం పేరుతో రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోపాలను సరిదిద్దే క్రమంలో త్వరలోనే రాష్ట్రంలోని పార్టీ కమిటీలను రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ,పార్లమెంటు ఎన్నికల్లో చురుకుగా పనిచేసిన నేతల వివరాలు తెప్పించుకుంటున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా బాధ్యతలను అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలకు కేసీఆర్ పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలంగాణ భవన్‌లో టాక్ వినిపిస్తోంది.






