07-10-2025 12:00:00 AM
కబడ్డీ ఆట నేపథ్యంలో రాజకీయాలు, గ్యాంగ్‌స్టర్ కథలతో కలిపి వైవిధ్యంగా రూపొందిన ద్విభాషా చిత్రం ‘బల్టీ’. ఇందులో షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్‌తోపాటు ‘ప్రేమమ్’ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉన్ని శివలింగం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళ భాషల్లో విడుదలై, ప్రేక్షకుల విశేషాదరణ పొందింది.
ఇప్పుడీ సినిమా ఎల్మా పిక్చర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎల్మా పిక్చర్స్ సంస్థ అధినేత ఎన్ ఎథిల్ రాజ్ మాట్లాడుతూ.. “తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్‌అండ్‌ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా ఉంటుందీ సినిమా.
ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారమే ఈ చిత్రం” అని తెలిపారు. ఈ చిత్రానికి సాయి అభయంకర్ సంగీతం అందించారు.