బండి సంజయ్ చేసింది సున్నా
l ఒక్క విద్యాసంస్థనైనా నిర్మించలేదు.. ఒక్క పరిశ్రమనైనా నెలకొల్పలేదు..
l బీజేపీ పాలనలో జాతి సంపద ధారాదత్తం
l మంత్రి పొన్నం ప్రభాకర్
l కరీంనగర్‌లో అట్టహాసంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ‘వెలిచాల’ నామినేషన్
కరీంనగర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఒక్క విద్యాసంస్థ, దవాఖాన, ఉపాధి శిక్షణా కేంద్రం, పరిశ్రమైనా తీసుకురాలేదని, మొత్తంగా ఆయన ప్రజలకు చేసిన మేలు ‘సున్నా’ అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రామచందర్‌రావుతో కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ వేయించారు.
అనంతరం నగరంలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి మాట్లాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌లో తిరుపతి వెళ్లే రైలుకు హాల్టింగ్ ఇప్పించానని, బండి సంజయ్ ఎంపీగా హాల్టింగ్‌ను ఎందుకు కొనసాగించలేకపోయారో తెలపాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే సంపదంతా ముస్లింలకు కట్టబెడుతుందని బీజేపీ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్లే పార్టీ అని స్పష్టం చేశారు.
వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం జాతి సంపదనంతా అంబానీలు, అదానీలకు కట్టబెట్టిందని ఆరోపించారు. ముస్లింల విషయం పక్కనపెట్టి పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశంలోని 85శాతం హిందువులకు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి, బీజేపీ హిందువుల ఓట్లను రాబట్టుకునేందుకు కుటిల రాజకీయాలు చేస్తోం దని నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ప్రజల్లో మధ్య అభద్రతాభావం నెలకొన్నదని, అందు కు కారణం బీజేపీనే అని మండిపడ్డారు. బీజేపీ నేతలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చెమటలు పట్టిస్తున్నదన్నారు.
కాంగ్రెస్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను: ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు
‘కాంగ్రెస్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను..’ అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తల తోడ్పాటుతో తాను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. గెలిస్తే ప్రజలకు సేవ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో అంటుంటే, బీజేపీ మాత్రం భారత్ తోడో అంటుందని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దించినట్లుగానే, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్నీ గద్దె దించుతుందన్నారు. గతంలోఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన బోయినపల్లి వినోద్, బండి సంజయ్ ప్రజలను చులకన భావంతో చూశారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.






