17 May, 2026 | 8:47 AM

ప్రచారంలోకి అగ్రనేతలు

23-04-2024 12:31 AM

l ఇప్పటికే మొదటి విడుత ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు

l కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, ఖర్గే.. 

l బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్ ప్రచారం  

l బీఆర్‌ఎస్ తరుఫున పార్టీ చీఫ్ కేసీఆర్ బస్సుయాత్రకు ఏర్పాట్లు

l నామినేషన్ల ముగిసిన తరువాత హోరెత్తనున్న కాంపెయిన్లు

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోరు ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. పార్టీ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో ఎంత ఖర్చుయిన సరే భరించి పార్లమెంటులో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మండలాలను చుట్టేశారు. మండల, నియోజకవర్గం స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీ గెలుపునకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా పార్టీ అగ్రనేతలనూ ప్రచారంలోకి దించి నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మూడు పార్టీల్లోని అగ్రనేతలు.. 

ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారంలోకి దిగి భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ విపక్ష పార్టీలపై దుమ్మెతిపోస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే దేశానికి సుపరిపాలన అందుతుందని, బీజేపీ మత రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని విమర్శలు చేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన తరువాత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ తరఫున ఇప్పటికే కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు తదితరులు రాగా.. ఈ నెల 23న విదేశాంగ మంత్రి జయశంకర్ భువనగిరికి, 24న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 25వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వరంగల్‌లో పర్యటించనున్నారు.

ప్రచారం చివరి రెండు రోజుల సమయంలో ప్రధాని మోదీ కూడా రెండు బహిరంగసభలకు హాజరుకానున్నట్లు పార్టీ ఎంపీ అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తరుఫున పెద్దఎత్తున ప్రచారం చేసేందుకు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఈ నెల 24 నుంచి మే 10 వరకు బస్సు యాత్రకు ఏర్పాటు చేసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి నియోజకవర్గంలో సమావేశం నిర్వహిస్తూ పార్టీ విజయం కోసం శ్రమిస్తున్నారు. జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మిషన్ 12 పేరుతో ప్రచారం చేస్తుండగా, గులాబీ నేతలు మాత్రం డబుల్ డిజిట్ సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.