ఫీజుల దోపిడీని అరికట్టాలిఫీజుల దోపిడీని అరికట్టాలి
అధికంగా వసూలు చేసే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): అధిక ఫీజులు వసూళ్లు చేసే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు రూ.3 లక్షలు, పాఠశాలల స్థాయిలోనూ రూ.3 లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారని వివరించారు.
ఇంటర్‌తోపాటు నీట్, జేఈఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్‌లకు ఇంకా అదనపు ఫీజులను వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఒకే కళాశాల, పాఠశాలకు అనుమతి తీసుకొని ఇతర ప్రాంతాల్లోనూ బ్రాంచ్‌లను అక్రమంగా నడుపుతున్నారని బుర్రా వెంకటేశం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఇంటర్ ప్రవేశాలకు ఇంకా నోటిఫికేషన్ జారీ చేయకున్నా పదో తరగతి విద్యార్థుల అడ్రస్ తెలుసుకొని మరీ అడ్మిషన్లు చేపడుతున్నారని తెలిపారు. ఇంటర్ చదివే వారిలో అత్యధికంగా బలహీనవర్గాల విద్యార్థులే ఉంటారని, కార్పొరేట్ ఫీజులు చెల్లించలేక అనేకమంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, అలాంటి వారికోసం కామన్ ఫీజు విధానాన్ని రూపొందించాలని కోరారు.
ఫీజుల నియంత్రణ చట్టం చేసి దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీలు, పాఠశాలలను నాలుగు విభాగాలుగా మార్చి, నాలుగు జోన్లుగా విభజించాలన్నారు. కళాశాలల్లో తనిఖీలు జరిపి అనుమతిలేని వాటిని మూసివేయించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణయ్య వెంట బీసీ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, పెరికే సురేశ్, రాజేందర్, వేముల రామకృష్ణ, నందగోపాల్ తదితరులు ఉన్నారు.






