కరీంనగర్‌లో బండి సంజయ్ హవా
- 45 శాతం ఓట్లు సాధించిన సంజయ్
- 2.25 లక్షల పైచిలుకు ఓట్లతో విజయకేతనం
- కరీంనగర్‌లో బీజేపీ కార్యకర్తల తీన్మార్
కరీంనగర్, జూన్ 4 (విజయక్రాంతి): బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి ప్రభంజనం సృష్టించారు. బీజేపీ గెలిచిన 8 స్థానాల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించి టాప్ గేర్‌లో నిలిచారు. మొత్తం 13 లక్షల 3 వేలకుపైగా ఓట్లు పోలవగా, అందులో 45 శాతం ఓట్లు సాధించడం గమనార్హం. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థులందరి కంటే ఎక్కువ శాతం ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అత్యధిక మెజార్టీ సాధించారు. 2006 ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు 2,౦1,581 ఓట్ల మెజార్టీ రాగా, 2014లో బీ వినోద్‌కుమార్‌కు 2,౦5,౦౦7 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
ఇప్పటి వరకు ఇవే అత్యధిక మెజార్టీ కాగా, తాజా ఫలితాలతో బండి సంజయ్ ఆ రికార్డులను బద్దలు కొట్టి కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు. ఏకంగా 2,25,209 భారీ ఆధిక్యం సాధించి కరీంనగర్ ఆల్‌టైం రికార్డును కైవసం చేసుకున్నారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కు 89,508 ఓట్ల మెజార్టీ కట్టబెట్టిన ప్రజలు ఈసారి అనూహ్యంగా అంతకు మూడు రెట్ల ఓట్లు 2 లక్షల 25 వేల పైచిలుకు ఓట్లు కట్టబెట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17,97,150 మంది ఓటర్లుండగా.. 13,౦3,690 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఉదయం 8 గంటలకు ఆరంభమైన ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ కాకుండా మొత్తం 24 రౌండ్లు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ సహా తొలి రౌండ్ నుంచే బండి సంజయ్ ఆధిక్యత కనబర్చారు.
మొత్తం 24 రౌండ్లకుగాను 22 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తొలుత వెనుకబడినప్పటికీ క్రమేపీ మెజార్టీ సాధిస్తూ వచ్చారు. అంతిమంగా ౫,౮౫,౧౧౬ ఓట్లు సాధించి అఖండ విజయాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు 27.41 శాతం 3,59,907 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ 21.49 శాతంతో 2,82,163 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఫలితాలు వెలువడగానే బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వేలాదిమంది కార్యకర్తలు కరీంనగర్ వీధుల్లోకి తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. ఎస్సారార్ కాలేజీ వద్దకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు బాణాసంచా పేలస్తూ, తీర్మాన్ డ్యాన్సులు చేస్తూ, బండి సంజయ్‌కుమార్‌ను భుజాలపైకి ఎత్తుకుని చిందులు వేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులతో కరీంనగర్ రోడ్డు కిక్కిరిసిపోయింది.
అమ్మకు పాదాభివందనం
కరీంనగర్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బండి సంజయ్‌కుమార్ మంగళవారం సాయంత్రం తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తొలిసారి 89,508 ఓట్ల మెజార్టీ ఇస్తే, నేడు మూడు రేట్లు అధికంగా మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ ప్రజలకు పాదాభివందనాలు తెలిపారు. ఈ విజయం కార్యకర్తలకే అంకితమన్నారు.
స్వయం సేవకుడి నుంచి ఎంపీ వరకు
తెలంగాణ బీజేపీ కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరు. 1971 జూలై 11న శకుంతల దంపతులకు సంజయ్ జన్మించారు. సంజయ్ జీవిత భాగస్వామి అపర్ణ బ్యాంకు ఉద్యోగి కాగా, ఆయనకు సాయి భరత్, సాయి సుముఖ్ కుమారులు. సంజయ్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. సంజయ్‌ని ఒకటో తరగతి సరస్వతి శిశు మందిర్‌లో చేర్పించారు. ఆయన బాల్యం నుంచే ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఘటన్ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా పనిచేశారు. ఏబీవీపీ కరీంనగర్ పట్టణ కన్వీనర్‌గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1994 నుంచి 2003 మధ్యకాలంలో కరీంనగర్ కోఱుఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. బీజేపీ కరీంనగర్ నగర అధ్యక్షునిగా పనిచేశారు.
2005లో కరీంనగర్ 48వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. వరుసగా వరుసగా మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2019లో కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా గెలిశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3,153 ఓట్ల తేడాతో ఓడారు. రెండు పర్యాయాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన సారథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీమెరుగైన ఫలితాలు బీజేపీ సాధించింది. అనంతరం పార్టీ ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాను కట్టబెట్టింది. 2024 జనవరి 3న కిసాన్ మోర్చా జాతీయ ఇన్‌చార్జిగా బండి సంజయ్ నియమితులయ్యారు. కరీంనగర్ ఎంపీగా ఆయన రెండోసారి భారీ మెజార్టీని స్వంతం చేసుకుని లోక్‌సభలో అడుగు పెడుతున్నారు.
నియోజకవర్గం కాంగ్రెస్ బీజేపీ బీఆర్‌ఎస్ విజేత
మెజారిటీ
కరీంనగర్ 3,59,907 5,85,116 2,82,163
బండి సంజయ్ 2,25,209






