కంటోన్మెంట్ స్థానం కాంగ్రెస్‌దే
అసెంబ్లీ ఉప ఎన్నికలో శ్రీగణేష్ గెలుపు
బీజేపీపై 13వేల ఓట్ల మెజార్టీ ఆధిక్యం
సిట్టింగ్ స్థానం కోల్పోయిన బీఆర్‌ఎస్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 4 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పునిచ్చారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ నారాయణ్ బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశతిలక్‌పై 13,208 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్‌కు 53,651 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి వంశతిలక్‌కు 40,445 ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదితకు 34,462 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 2,53,706 ఓట్లు ఉండగా 1,30,450 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లు 844. లోక్‌సభ ఫలితాల్లో నగరంలో కాంగ్రెస్ ప్రభావం చూపకపోయినప్పటికీ కంటోన్మెంట్ విజ యం ఆ పార్టీకి కాస్త ఊరటనిచ్చింది. కచ్చితంగా ఉప ఎన్నికల్లో గెలుస్తామనుకున్న బీఆర్‌ఎస్‌కు భంగపాటు కలిగింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.
పార్టీ మారి.. విజేతగా నిలిచి
2018 సార్వత్రిక ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన శ్రీగణేష్‌కు ఆ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే టికెట్ నిరాకరించింది. దాంతో చివరి నిమిషంలో బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2019లో బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న మరణానంతరం తనకే బీఆర్‌ఎస్ టికెట్ వస్తుందని భావించినప్పటికీ ఆ పార్టీ టికెట్‌ను సాయ న్న కూతురు లాస్యనందితకు కేటాయించడంతో శ్రీగణేష్ మళ్లీ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు.
2023ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యనందిత 2024 ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా శ్రీగణేష్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఉప ఎన్నికల్లో సాయన్న చిన్నకూతురు నివేదితకు బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించగా.. మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తన విజయం కంటోన్మెంట్ ప్రజలకు అంకితమని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్‌ఎస్‌కు షాక్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవక పోగా తప్పకుండా గెలుస్తా మనుకున్న కంటోన్మెంట్‌లో కూడా ఓడిపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. సంవత్స రంలోనే తండ్రి సాయన్న, సోదరి లాస్య నందితను కోల్పోయిన బాధ లో ఉన్న నివేదితకు బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థిగా బరిలో నిలిపింది. సానుభూతి కలిసి వచ్చి తప్పకుండా గెలు స్తుందనుకున్న చోట బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.






