11 May, 2026 | 3:20 AM

ముంబై ఇంటికి

11-05-2026 02:02 AM

టాప్ ప్లేస్ కు ఆర్ సీబీ

ఉత్కంఠతో ఊపేసిన మ్యాచ్

భువి ఆల్ రౌండ్ షో

ఏమన్నా మ్యాచ్.... చివరి బంతి వరకూ ఉత్కంఠతో ఊపేసింది... రెండు బెస్ట్ టీమ్స్ పోటీపడితే ఎలా ఉంటుందో మరోసారి అభిమానులకు అర్థమైంది. చివరికి ఒత్తిడి జయించిన బెంగళూరు గెలిస్తే.. ముంబై కథ ముగిసింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో పాటు చివర్లో సిక్సర్ కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. 

రాయ్ పూర్, మే 10 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్థిక్ పాండ్యా దూరమవడంతో మరోసారి సూర్యకుమార్ కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. భారీస్కోరు చేయడమే లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైని భువనేశ్వర్ కుమార్ బెంబేలెత్తించాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడదొట్టాడు. రోహిత్ శర్మ (22), రికెల్టన్ (2), సూర్యకుమార్ (0) ఔటయ్యారు. దీంతో ముంబై కేవలం 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశ లో నమన్ ధీర్, తిలక్ వర్మ ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 57 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నమన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 రన్స్ చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు.  ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. భువనేశ్వర్ కేవలం 23 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

హ్యాజిల్ వుడ్, సలామ్ దార్, షెపర్డ్ ఒక్కో వికెట్ తీసారు. ఛేజింగ్ లో బెంగళూరు కూడా తడబడింది. ముంబై పేసర్ కార్బిన్ బోస్చ్ , దీపక్ చహార్ చెలరేగడంతో ఆర్సీబీ 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ డకౌటవగా.. పడిక్కల్ 12, పటిదార్ 8 పరుగులకే ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో కృనాల్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. బెథెల్ తో కలిసి 55 పరుగులు జోడించాడు. బెథెల్ (27) ఔటైన తర్వాత జితేశ్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించాడు. జితేశ్ శర్మ (18) , టిమ్ డేవిడ్ డకౌటవడం ముంబైలో ఆశలు చిగురించాయి.

కాసేపటికే కృనాల్ పాండ్యా 73 (4 ఫోర్లు, 5 సిక్సర్లు) వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్‌లో బుమ్రా కేవలం 3 పరుగులే ఇవ్వడంతో విజయం కోసం చివరి ఓవర్లో 15 రన్స్ చేయాల్సి వచ్చింది. షెఫర్డ్ భారీ షాట్లు కొట్టలేక పడగా.. బౌలర్ రాజ్ బవా ఒత్తిడికి లోనై వైడ్లు వేశాడు. 11 బంతులాడి 4 పరుగులే చేసిన షెఫర్డ్ మూడో బంతికి ఔటవ డంతో ముంబై గెలుస్తుందనుకున్నారు. అ యితే క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. చివ రి బంతికి సలామ్ దార్ రెండు పరుగులు తీయడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

స్కోరు బోర్డు

ముంబై ఇన్నింగ్స్ : 166/7 ( తిలక్ వర్మ 57, నమన్ ధీర్ 47, రోహిత్ శర్మ 22, భువనేశ్వర్ 4/23, షెపర్డ్ 1/18 )

బెంగళూరు ఇన్నింగ్స్ : 167/8 ( కృనాల్ పాండ్యా 73, బెథెల్ 27, జితేశ్ శర్మ 18,  కార్బిన్ బోస్చ్ 4/26, దీపక్ చాహర్ 2/33 )