06-12-2025 07:53:43 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యాలు పూర్తి చేయడంలో బ్యాంకర్లు మరింత చురుకుదనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో డీసీసీ, డిఎల్ఆర్సీ సమీక్షా సమావేశంలో ఆయన బ్యాంకర్లు, జిల్లా శాఖాధికారులతో రుణాల పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య వివిధ రంగాల్లో రుణాల విడుదల వివరాలు వెల్లడించారు. వ్యవసాయం , వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ 3899.28 కోట్ల లక్ష్యానికి గాను రూ 2138.26 కోట్లు, ఎంఎస్ఎం ఈ రంగంలో రూ 847.80 కోట్ల లక్ష్యానికి గాను రూ 439.84 కోట్లు, విద్యా రుణాల్లో రూ 6.96 కోట్లు, హౌసింగ్ లోన్లలో రూ 10.84 కోట్లు, ఇతర రంగాల్లో రూ 35.09 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
మొత్తం లక్ష్యాల్లో 53.33 శాతం సాధించినట్లు తెలిపారు. రైతుల రుణ రేన్యూవల్‌పై అవగాహన కల్పించి, వ్యవసాయ శాఖతో కలిసి బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వెంటనే పరిశీలించి మంజూరు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, లబ్ధిదారులు సకాలంలో బ్యాంకులకు చెల్లించే విధంగా శాఖలు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో మునగ సాగు విజయవంతంగా కొనసాగుతుందనీ, ఇప్పుడు రైతుల ఆర్థిక అభివృద్ధికి సమీకృత వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా తీసుకెళ్లే సమయం వచ్చిందని అన్నారు.
ప్రత్యేకంగా చేపల పెంపకం యూనిట్ల స్థాపనపై ఆయన వివరించి మాట్లాడుతూ.. ఒక్క చేపల పెంపకం యూనిట్ స్థాపనకు సుమారు రూ.4.5 లక్షలు ఖర్చవుతుందని, అందులో చేప పిల్లల కొనుగోలు, ఫీడ్, ట్యాంకులు,షెడ్, ఏరేషన్ పరికరాలు, నిర్వహణ సామగ్రి వంటి అంశాలు ఉంటాయని, ఆధునిక బయోఫ్లాక్ టెక్నాలజీ, పొండ్–బేస్డ్ మోడళ్లతో ఈ యూనిట్లు సంవత్సరం పొడవునా ఆదాయం అందిస్తాయని వివరించారు. సరైన పద్ధతుల్లో చేపల పెంపకం చేపడితే ప్రతి 90–120 రోజులకు ఒక చక్రం పూర్తవుతూ, రైతులకు గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉందని, పెట్టుబడి కొద్దికాలంలోనే తిరిగి వచ్చే అవకాశముందని తెలిపారు.
కౌజు పిట్టల పెంపకంద్వారా నెలకు రూ 10,000 ఆదాయం వస్తుందని, కూరగాయల సాగు వంటి యూనిట్లతో కలిపి చేపల పెంపకం చేస్తే రైతుల నెలవారీ ఆదాయం మరింత పెరగగలదని అన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చేపల పెంపకం రైతుల జీవన ప్రమాణాలను గణనీయంగా మార్చిన ఉదాహరణలను చూపిస్తూ, మన జిల్లాలో కూడా ఇదే మోడల్ అమలుచేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కలెక్టర్ తెలిపారు. .జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు బ్యాంకులు ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. యూనిట్ల స్థాపనకు అనుమతి పొందిన దరఖాస్తులన్నీ మూడు రోజుల్లోగా మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.