బ్యాట్‌మ్యాన్ రాహుల్
- లోక్‌సభ ప్రతిపక్ష నేతకు సూపర్ హీరో ఇమేజ్
- ‘ది రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్’ అంటూ ఏఐసీసీ కార్యాలయం వద్ద, ఢిల్లీలో బ్యానర్లు
- సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ/ముంబై, ఆగస్టు 24: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీను ‘నిజ జీవిత బ్యాట్‌మ్యాన్’గా అభివర్ణిస్తూ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బ్యాట్‌మ్యాన్ రూపంలో రాహుల్ చిత్రాన్ని, ఆయన సాధారణ ఫొటోను కలిపి రూపొందించిన ఈ పోస్టర్లపై ‘ఎల్‌వోపీ రాహుల్‌గాంధీ -ది రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్’, ‘సైలెంట్ గార్డియన్’(నిశ్చబ్ద రక్షకుడు), ‘వాచ్‌ఫుల్ ప్రొటెక్టర్’ (సదా గమనిస్తూ కాపాడే రక్షకుడు) వంటి క్యాప్షన్లు కనిపిస్తున్నాయి.
ఈ పోస్టర్లు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. రాహుల్‌గాంధీని సూపర్ హీరో పాత్రతో పోల్చడం ద్వారా యువత, ముఖ్యంగా జెన్ జీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల రాహుల్‌గాంధీ నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ ఇంటరాక్షన్‌లో ఓ నెటిజన్ ‘మీరేమైనా బ్యాట్‌మ్యానా?’ అని సరదాగా ప్రశ్నించగా.. ‘ఈ ప్రపంచంలో నన్ను, బ్యాట్‌మ్యాన్‌ను ఇంతవరకు ఎవరూ ఒకే రూమ్‌లో చూడలేదు.. చూడలేరు కూడా’ అంటూ ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
ఆ వ్యాఖ్యల తర్వాత ఈ పోస్టర్లకు మరింత ప్రాధాన్యం లభించింది. దీనికి తోడు బ్యాక్‌గ్రౌండ్‌లో డార్క్ నైట్ సినిమా థీమ్ మ్యూజిక్‌తో వర్షంలో నిల్చొని ఉన్న ఓ వీడియో క్లిప్‌ను కూడా రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాహులపై వెలిసిన బ్యానర్లు, పోస్టర్లపై కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేడా స్పందిస్తూ.. ‘హీరోలంతా కేప్‌లు ధరించరు. కొందరు తెల్లటి టీ-షర్ట్ ధరిస్తారు’ అంటూ పరోక్షంగా రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.






