సెప్టెంబరు 11న బ్యాంకర్ల సమ్మె
- వారానికి 5 రోజుల పనిదినాలు డిమాండ్
- పెన్షన్లు, పీఎల్‌ఐ కోసం దేశవ్యాప్త సమ్మె
- కేంద్రం స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె
న్యూఢిల్లీ, ఆగస్టు 24: వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌తో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ), పింఛన్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగుల ఐక్య వేదిక సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఐక్య వేదిక సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం, బ్యాంకుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. కాగా సెప్టెంబర్ 30తో ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం ముగియనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు కీలకంగా ఉండే సమయంలో సమ్మెకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
ఉద్యోగుల సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఒక రోజు మూతపడనుండగా, ఆ తర్వాత వరుస సెలవులు రావడంతో సేవలకు నాలుగు రోజుల పాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 11న శుక్రవారం సమ్మె ప్రభావం ఉంటుంది. అనంతరం రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉండనుంది.
దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకు శాఖల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్కుల క్లియరెన్స్, ఇతర శాఖా ఆధారిత లావాదేవీలపై ప్రభావం పడొచ్చు. అయితే ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.






