బీసీ డిక్లరేషన్ గాలికి వదిలేశారు
బీసీల కోసం ఖర్చు చేస్తామన్న నిధులు ఏమయ్యాయి?
టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
కామారెడ్డి/ మెట్టుపల్లి/కోరుట్ల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి గాలికి వదిలేసారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు(టీఆర్పీ) తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో టీఆర్పీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్య ర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కామారెడ్డిలో కాంగ్రె స్ పార్టీ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ చేసి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు. బీసీలకు సంవత్సరానికి రూ.20 వేలకోట్లు ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు.
బీసీల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 18 వేల కోట్లు ఎటుపోయాయని మల్లన్న ప్రశ్నించారు. పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పథకం కింద 2014 రూ.1,054 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి రూ. 607.40 కోట్లు మాయం చేశారన్నారు.2015 529 కోట్లు, 2017 1,470 కోట్లు, 2018 లో రూ. 1,790 కోటు తిన్నారని, ఆ సొమ్మంతా మూకుమ్మడిగా పంచుకున్నారని మలన్న ఆరోపించారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో లెక్కలపై వారిని నిలదీయాలన్నారు. మూకుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని కోట్లలో దోచేశాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో బీడీ కార్మికులకు పింఛన్ల కోసం నిధులు కేటాయిస్తే అందులో భారీ దోపిడీకి పాల్పడ్డారన్నారు.
2017 రూ.430 కోట్లు కేటాయిస్తే రూ.45.28 కోట్లు దోచుకున్నార న్నారు.2019 రూ.803 కోట్లు కేటాయిస్తే రూ.84.30 కోట్లు దోపిడీకి పాల్ప డ్డారన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎన్నికల్లో ఏమిచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం కత్తెర గుర్తుకు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశం లో టీఆర్పీ నాయకులు హరిశంకర్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ఆకుల హనుమండ్లు, టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు తాహెర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోషి, కౌన్సిలర్ అభ్యర్థులు, ప్రజలు పాల్గొన్నారు.
మెట్టుపల్లిలో మల్లన్న ప్రచారం
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి మున్సిపాలిటీలోని టీఆర్పీ తరఫున 2వ వార్డు అభ్యర్థి గట్టెపల్లి మమత రాజశేఖర్ ,7వ వార్డు అభ్యర్థి జొరిగె రజిత శ్రీనివాస్, 8వ వార్డు అభ్యర్థి లావణ్య, 15వ వార్డు అభ్యర్థి బోపరతి లతా శ్రీనివాస్, 16వ వార్డు అభ్యర్థి నత్యా బాజమ్మ, 19వ వార్డు అభ్యర్థి సుశీల గెలుపు కోసం టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్‌యాదవ్, ప్రధానకార్యదర్శి ఆకుల హనుమండ్లు, కార్యదర్శి కొమ్ము ల ప్రవీణ్‌రాజ్, యువజన విభాగం అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సాయిని పాపయ్య, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
కోరుట్లలోని వార్డుల్లో టీఆర్పీ జోరుగా ప్రచారం
కోరుట్లలోని పలు వార్డుల్లో టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో టీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్నం రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా మల్లన్న ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల హక్కులు, రాజ్యాధికార సాధన, సామాజిక న్యాయం అనే అంశాలను ప్రజలకు వివరిస్తూ, కత్తెర గుర్తుకే మన ఓటు అనే నినాదంతో పార్టీ లక్ష్యాలను స్పష్టంగా తెలియజేశారు. సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ప్రజల కోసం, ముఖ్యంగా బీసీ వర్గాల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కోరుట్ల మున్సిపాలిటీ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం రాజశేఖర్ వంటి నేతను గెలిపించాలన్నారు.






